తెలుగు ప్రజలకు చల్లని కబురు...
తెలంగాణ వాసులకు శుభవార్త. ఎందుకంటే.. భానుడి ప్రతాపం మండే ఎండల్లో ఇబ్బంది పడిన తెలంగాణ ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. తెలంగాణలో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ క్రమంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని, వాటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భానుడి విశ్వరూపానికి హడలిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఊరట కలిగించిందని చెప్పాలి.
ఆదివారం బేగంపేట, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల, బహదూర్ పల్లి, సూరారం, మల్కాజిగిరి, ఆల్వాల్, నేరేడ్ మెట్, తిరుమలగిరి, బహదూర్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగర శివార్లలో అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు కూడా వీచాయి.
మరోవైపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిన్న సాయంత్రం పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కర్నూలు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. విశాఖలో మేఘాలు దట్టంగా అలముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోనసీమ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. అనకాపల్లి, మారేడుమిల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కర్నూలు వాగులు పొంగడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.