అక్రమం సంబంధం.. ప్రియుడితో భర్తను అడ్డంగా నరికేసిన భార్య
వెస్ట్ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల జి.కొత్తపల్లిలో వివాహేతర హత్య జరిగింది. తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరానికి చెందిన చప్పా చిన్నారావు ఈనెల 16 ఉదయం జి.కొత్తపల్లి నుంచి దూబచర్లకు వెళ్లే రహదారి పక్కన తీవ్ర రక్తగాయాలతో పడివుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో 108 సిబ్బంది సహాయంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన భార్య అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన చిన్నారావు ఈనెల 19వ తేదీన చనిపోయాడు. దీంతో పోలీసులు ఈ కేసును హత్యా నేరం కింద నమోదు చేశారు. ఈ క్రమంలో అమ్మాజీ ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ విచారణలో అదే ఊరికి చెందిన లక్కోజు సత్యనారాయణ అనే వ్యక్తితో అమ్మాజీకి వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
అక్రమ సంబంధం సాఫీగా సాగేందుకు భర్తను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రియుడు లక్కోజు సత్యనారాయణతో కలిసి హత్యకు కుట్ర పన్ని చంపేసినట్టు వెల్లడించింది. వారి ప్లాన్‌లో భాగంగా, ఈనెల 16వ తేదీన భీమవరం నుంచి తీసుకొచ్చి ఘటనాస్థలం వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి అనంతరం చిన్నారావు మృతిచెంది ఉంటాడని భావించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఏమీ తెలియనట్లు ఆస్పత్రికి వచ్చిన అమ్మాజీ తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టిపడేశారని ఫిర్యాదు చేసి.. చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది.