సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (08:12 IST)

సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.

ఫలితంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖపట్నంకు పరిపాలిక రాజధాని, కర్నూలుకు జ్యూడిషియల్ రాజధాని, అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని పెట్టే ప్రతిపాదన చేసింది. శాసనసభలో బిల్లును ఆమోదించింది. అంతే కాదు…సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి…శాసనమండలికి పంపింది.

అక్కడ కూడా బిల్లులు ఆమోదం పొందితే సమస్య లేనట్లే. కానీ మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దును మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తోంది. అందుకే శాసనసభలో అడ్డుకునే పని చేసింది. అయినా బిల్లు పాసైంది. ఇప్పుడు మండలిలో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది.

ఇందుకు రూల్ నెంబర్ 71ను తీసుకువచ్చింది. శాసనమండలిలో 32 మంది సభ్యులతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిలు టీడీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు.

శమంతకమణి, శత్రుచర్లలు అసలు సభకే రాలేదు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా 27 మంది సభ్యులే టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీనితో బిల్లుల పై ఓటింగ్ జరగకముందే రూల్ 71 ప్రకారం ప్రభుత్వానికి మెజార్టీ లేదని తేల్చేసింది.
 
రూల్ నెంబర్ 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ… రాత్రి ‘సెలెక్ట్‌ కమిటీ’ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మండలి చైర్మన్‌ షరీఫ్ కు ఒక లేఖ అందించింది.

మరోవైపు బిల్లులకు సవరణలు ప్రతిపాదించారు ఆ పార్టీ నేతలు. అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని కోరింది. సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణల్లో ప్రతిపాదించింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు సాధ్యం కాదని వాదించింది.

సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ శాసన మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టే. శాసనసభ ఏం ఆమోదిస్తే అదే చట్టం అవుతుంది. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది.

టీడీపీ కోరినట్లుగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఆలస్యమవుతోంది. సెలెక్ట్ కమిటీలో శాసనసభ, శాసనమండలి సభ్యులలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. పార్టీకి ఒకరినైనా లేక ఇద్దరినైనా తీసుకోవచ్చు. అధికార, విపక్ష కమిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎంత మంది ఉండాలి. ఏంటనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
 
ఆ కమిటీ ఈ బిల్లులను ముందుగా పరిశీలిస్తుంది. బిల్లు ఆమోదం పొందితే వచ్చే పరిణామాలు, కాకపోతే వచ్చే అంశాలు, బిల్లు అమలు సాధ్యా సాధ్యాలను చర్చిస్తుంది. ఆ తర్వాత కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఈ పరిశీలనకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ ఈ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది.

ఈ బిల్లులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. అదే జరిగితే మూడు రాజధానుల మార్పు ఆలోచన చేస్తున్న సర్కారు వేగానికి బ్రేకులుపడతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గే వీలుంది.