మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (07:53 IST)

శెభాష్.. షరీఫ్

కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న రాజధాని మార్పు విషయంలో మంగళ, బుధవారాల్లో మండలిలో చైర్మన్ వ్యవహరించిన తీరు.. ఒక్క అధికార పార్టీ తప్ప అన్ని వర్గాల ప్రశంసలూ అందుకుంటోంది.

ముఖ్యంగా బుధవారం అటు రాష్ట్ర మంత్రులు, పాలక పక్ష సభ్యులు.. ఇటు మెజారిటీ ఉన్న టీడీపీ సభ్యుల వాదోపవాదాల నడుమ ఆయన చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో అందరి దృష్టి చైర్మన్ షరీఫ్ పై పడింది. ఇంతకీ ఎవరీ ఫరీఫ్?
 
ఎన్టీఆర్‌కు వీర విధేయుడు.. టీడీపీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుడు.. వివాదరహితుడు.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే స్వభావం.. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి.. శాసనమండలి చైర్మన్‌ పీఠం అధివసించారు. ఆయనే ఎంఏ షరీఫ్‌. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఆయన స్వస్థలం. రాజకీయాల్లో చడీచప్పుడు లేకుండా పైకొచ్చారు.

వినయం, విధేయత, సమయస్ఫూర్తి ఆయన ఆస్తులు. షరీఫ్‌ 2004-2009 మధ్య టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2015లో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. 2017లో ప్రభుత్వ విప్‌ అయ్యారు. పార్టీకి అంతర్గతంగా సేవలు అందించి మన్ననలు అందుకున్న ఆయన్ను.. టీడీపీ అధినేత చంద్రబాబు మండలి చైర్మన్‌గా అందలమెక్కించారు.
 
అధికార పక్షం సభలోనే తనకు రాజకీయాలు ఆపాదించినా.. నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని టీడీపీ సూచిస్తున్నా.. షరీఫ్‌ మాత్రం ఎక్కడా ఏకాగ్రతను కోల్పోలేదు. సభ నియమావళిని అతిక్రమించలేదు. రెండు బిల్లులను సెలక్ట్‌ కమిటీకి నివేదిస్తారా లేదా అని షరీఫ్‌ తీసుకునే నిర్ణయం కోసం సభ్యులతోపాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో గంటలపాటు ఎదురుచూశారు.
 
చివరకు సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిశ్చయించారు. ‘షరీఫ్‌ మొదటి నుంచీ పార్టీలో ఆటుపోట్లు చూసినవారేనని టీడీపీ నేత పాలి ప్రసాద్‌ తెలిపారు. ‘ఏమాత్రం తొణకకుండా నిబ్బరంగా వ్యవహరించేవారు. మృదుస్వభావి. ఎవరినీ కించపరచకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆరితేరారు.

ఇప్పుడు కూడా ప్రజలు కోరుకున్నట్టుగానే సమాంతరంగా, నిబంధనలకు అనుగుణంగానే మండలిలో వ్యవహరించారు’ అని కొనియాడారు.