మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 నవంబరు 2019 (14:16 IST)

లక్షమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఎస్వీ యూనివర్సిటీ అధికారులు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అధికారులు మరోసారి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం కాస్త 70వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చేసిన తప్పు చేసి సాంకేతిక లోపమంటూ చేతులెత్తేశారు ఎస్వీయు అధికారులు. ఇంతకీ ఎస్వీయు అధికారులు చేసిన తప్పేంటి.. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి..
 
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రాముఖ్యత కలిగిన విశ్వవిద్యాలయం. ఎంతోమంది ప్రముఖులు ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అయితే అలాంటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా డిగ్రీ పరీక్షల నిర్వహణలో భారీగా తప్పులు దొర్లాయి. బిఎస్పీ విద్యార్థికి బికాం పరీక్షలు రాయాలనడం.. తిరుపతికి చెందిన విద్యార్థులను చిత్తూరుకు.. ఆ ప్రాంతంలోని విద్యార్థులను తిరుపతికి పలమనేరు, పీలేరు విద్యార్థులను మదనపల్లెలోని పరీక్ష కేంద్రాలకు పంపడం ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా డిగ్రీ పరీక్షల నిర్వహణలో తప్పులు చోటుచేసుకున్నాయి. 
 
పరీక్షల ప్రారంభానికి సరిగ్గా రెండురోజుల ముందు ఎస్వీయు హాల్ టిక్కెట్లు జారీ చేశారు. వీటి ముద్రణలో చోటుచేసుకున్న తప్పిదాలతో విద్యార్థులు..ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ కు సంబంధించిన పటిష్టమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వీటిని సడలిస్తూ ఎస్వీయు ఇటీవల పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం పెంచింది. గతంలో జిల్లా వ్యాప్తంగా 53పరీక్షా కేంద్రాలు ఉండగా ప్రస్తుతం మరో పది పెంచుతూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రాలను పెంచినట్లు పరీక్షల కార్యాలయం అదికారులు చెబుతున్నారు. తీరా హాల్ టిక్కెట్ల ముద్రణలో విద్యార్థుల జంబ్లింగ్ వివరాలు ఇష్టానుసారంగా పొందుపరిచారు.
 
హాట్ టిక్కెట్ల బయటకు వచ్చిన వెంటనే ఇదంతా సాంకేతిక లోపమంటూ అధికారులు చెబుతున్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులకు చిత్తూరులోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. 15 నుంచి ఇరవై కిలోమీటర్లలోపే పరీక్షా కేంద్రాలను కేటాయించాలన్న నిబంధనలు ఉన్నా తిరుపతి విద్యార్థులను 70కిలోమీటర్ల దూరంలోని చిత్తూరు పరీక్షా కేంద్రాలకు  కేటాయిస్తూ హాల్ టిక్కెట్లో పొందుపరిచారు. చిత్తూరులోని వివిధ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దాదాపు 70కిలోమీటర్ల అవతల ఉన్న పలమనేరులో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 
 
సాధారణంగా హాల్ టిక్కెట్లు అంటే విద్యార్థికి సంబంధించిన ఫోటో కీలకం.. దాని ఆధారంగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎస్వీయు విడుదల చేసిన డిగ్రీ హాల్ టిక్కెట్లలో విద్యార్థుల ఫోటోలు కనుమరుగయ్యాయి. కొంతమంది ఏడు సబ్జెక్టులు రాయాల్సి ఉండగా హాల్ టిక్కెట్లలో కేవలం ఐదు సబ్జెక్టులనే పొందుపరిచారు. విద్యార్థులకు హాల్ టిక్కెట్ల క్రింద పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పొందుపరుస్తారు. నిబంధనల్లో కనీసం ఊరు పేర్లు కూడా మార్చకుండా అలాగే హాల్ టిక్కెట్లలో పొందుపర్చారంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
చిత్తూరుజిల్లా వ్యాప్తంగా మొత్తం 63 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఎస్వీయు నిర్ణయం తీసుకుంది. మొత్తం కలిపి 75,727మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా ప్రణాళికలు రూపొందించారు. ఆయా కేంద్రాలకు ప్రత్యేకంగా కోడ్ నెంబర్లను ఎంపిక చేస్తారు. వీటి ఆధారంగానే ప్రశ్నా పత్రాల కేటాయింపులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రాల కోడ్ లు కీలకమౌతాయి. ఇక్కడే ఎస్వీయు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. చిత్తూరులోని విజేత డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి కోడ్ నెంబర్ 35ను కేటాయించారు. అదే నగరంలోని విజ్ఙాన సుధ డిగ్రీ కళాశాలకు సైతం కోడ్ నెంబర్ 35నే కేటాయించడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.