సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (13:58 IST)

పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి : చిన్నకృష్ణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మందిని ఖండించారు. తాజాగా సినీ రచయిత చిన్నికృష్ణ కూడా పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 
 
పవన్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడంతో హైదరాబాద్‌లో తమ మీద దాడులు జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 
 
రాజకీయ స్వలాభం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు. ఎగువ రాష్ట్రాలకు దిగువ రాష్ట్రాలు తలొగ్గి ఉండాలని చిన్నికృష్ణ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమకు చిరంజీవి ఫ్యామిలీ చేసింది ఏమీ లేదని, ఓట్ల కోసం ప్రజలను మెగా ఫ్యామిలీ మభ్య పెడుతోందని ఆరోపించారు. 
 
తెలంగాణ, ఆంధ్రా ప్రజల బంధం 70 ఏళ్లుగా బలపడింది. మేమంతా ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నామన్నారు. పవన్‌ కల్యాణ్‌ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పవన్‌ నీ సిద్ధాంతమేంటో ముందే చెప్పాలి. మీ రాజకీయాల కోసం మా జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 
 
కాపు కులస్థులకు మెగాస్టార్‌ ఫ్యామిలీ ప్రతినిధి కాదు. కేవలం మీ అందరి వల్లే.. ఆంధ్రప్రదేశ్‌కు వెళితే ఇప్పుడు ఇబ్బందిగా ఫీలవుతున్నాను. భారతదేశంలో అత్యుత్తమమైన సీఎం.. కేసీఆర్‌. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో సంతోషంగా ఉన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్‌ చెప్పినట్లుగానే ఆంధ్రా ప్రజలతో పాటు అన్ని రాష్ర్టాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పారు. 
 
హైదరాబాద్‌లో మాకు ఏమైనా అయితే.. మీ అన్న నాగబాబు వచ్చి మమ్మల్ని కాపాడతాడా? ఎన్నో రికార్డులు సృష్టించిన "ఇంద్ర" వంటి సినిమా ఇస్తే.. మీ అన్న చిరంజీవి కనీసం భోజనం కూడా పెట్టలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి మోసం చేశారు.. కాంగ్రెస్‌లో కలిపారని చిన్నికృష్ణ అన్నారు.