శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:25 IST)

ప్రజావ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది: చంద్రబాబు

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో, కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు వర్చ్యువల్ సమీక్ష నిర్వహించడం జరిగింది. అంతకుముందు విశాఖ, తిరుపతి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమీక్షలు ముగిశాయి. ప్రస్తుతం నాలుగో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్యనేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. వైసీపీ విధానాలను ఎండగట్టారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. "వర్చువల్ మహానాడు స్పూర్తితో కరోనాను నిలువరించడమే ధ్యేయంగా వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉండాలి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే ఉండాలి. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అదే సమయంలో కరోనా నేపథ్యంలో జాగ్రత్తగానూ నడచుకోవాలి. నేను ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాను. ప్రతి కార్యకర్త, మండల, జిల్లా స్థాయి నాయకులు తన తోటి నాయకులతో చేయి చేయి కలిపి నడవాలి. 

మన పార్టీ నాయకులు చాలా మంది కరోనాతో చనిపోయారు. చాలా మంది ఆర్ధికంగా నష్టపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాం. ఆర్ధికంగా నష్టపోయిన వారికి పార్టీ అండగా ఉంటుంది. ఆరోగ్యపరంగా నిపుణులతో చర్చిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాలు కందిపోయేలా జెండా మోశారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తి ప్రత్యర్ధుల దాడుల్లో ప్రాణాలు వదిలినా.. మిగిలిన కుటుంబం ఇంకా పార్టీతోనే ఉంది. అది అనంతపురం జిల్లా ప్రజల పట్టుదల.

అనంతపురం తీవ్ర నీటి ఎద్దడి కలిగిన జిల్లా. అందుకే సాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టుల కోసం రేయింబవళ్లు శ్రమించాం. కరువు సమయంలో అక్కడే ఉండి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాం. ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభ్యున్నతికి మనం ముఖ్య ప్రాధాన్యతనిచ్చా. ఆ క్రమంలో పార్టీని కాస్త నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. కానీ.. భవిష్యత్తులో అలాంటి తప్పు జరగబోదని హామీ ఇస్తున్నా. 

ప్రజావ్యతిరేక విధానాలతో ఈ ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. ఎన్నో పోరాటాల తర్వాత మీటర్లు లేకుండా రైతులకు వచ్చిన ఉచిత విద్యుత్ సాధిస్తే.. అప్పుల కోసం రైతు బతుకుల్ని తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గపూరితమైన చర్య. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి.

అనంతపురంలో జేసీ కుటుంబ సభ్యులను, శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో చూస్తున్నాం. విడుదలైన వారిపై మళ్లీ తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడికి కరోనా అంటించారు. జగన్ కు ఎందుకు ఓటేశామా అని ప్రజలు ఫీలవుతున్నారు. ఇదే సమయంలో ప్రజలందరినీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా సీట్లు వచ్చాయి.

ఇప్పుడు జగన్ కూడా అదే రీతిన కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. కృష్ణా
జిల్లాలో ఎవరెవరో కొట్టుకుంటే అడ్డుకున్న పాపానికి తెలుగుదేశం పార్టీ నాయకుడిని కేసులతో వేధించడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి.

ప్రతి కార్యకర్త పార్టీకి అండగా నిలుస్తున్నారు. అడ్డుగోడలా కాపు కాస్తున్నారు. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టినా కేసులు పెడుతున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మనం సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వినియోగిద్దాం. ప్రభుత్వ నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలే. అందువలన తప్పుడు కేసులు ఎదుర్కొంటున్నవారెవరూ బయపడాల్సిన అవసరం లేదు. వైసీపీ పై రాజీలేని పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నరేగా బిల్లులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. త్వరలో  నరేగా బిల్లులు వచ్చేలా పోరాడుదాం. పసుపు చైతన్యం పేరుతో అన్ని రకాల సామాజికవర్గాలను ప్రభావితం చేసేలా నాయకులను తయారుచేసుకుందాం. సంప్రదాయ ఓటర్లను పార్టీకి అండగా ఉండేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

తెలుగుదేశం పార్టీ నేతలనే ఉద్దేశ్యంతో అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారు. అలాంటి వివరాలన్నింటినీ రికార్డు చేసి పోరాడుదాం. మన హక్కుల్ని సాధించుకుందాం. గతంలో పేపర్, ఛానళ్లు ప్రచార సాధనాలుగా ఉంటే.. దాన్ని సోషల్ మీడియా ఓవర్ కం చేసింది. మనం సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ కార్యక్రమాల విషయంలో స్థానిక నేతలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. 
 
పార్టీ నేతలు ఎవరైనా కష్టాల్లో ఉంటే పార్టీ అండగా ఉంటుంది. అనంతపురంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతని కుటుంబానికి పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. అతని కుమార్తె నేడు సివిల్స్ లో 190వ ర్యాంకు సాధించింది. ఇలంటివి మన పార్టీకి ఎంతో గర్వకారణం. కరోనా సమయంలో పార్టీ నేతల సేవలు చిరస్మరణీయం.

వ్యవసాయంలో కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాం. అనంతపురం అరటి అంతర్జాతీయ మార్కెట్ సొంతం చేసుకుంది. డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ను ప్రోత్సహించాం. భూగర్భజలాలు పెంచాం. చివరి ఎకరాకు కూడా నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేశాం. మడకశిర, గండికోట, చర్లోపల్లి వంటి రిజర్వాయర్లు పూర్తి చేయడంతో నీటి కొరత తీర్చాం.

అనంతపురం నుంచి బెంగళూరు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ తయారు చేయాలని భావించాం. అందులో భాగంగానే కియాను అనంతపురంలో ఏర్పాటు చేశాం. వందలాది అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చాం. బర్గర్ పెయింట్స్ సహా పలు అసెంబ్లింగ్ యూనిట్స్, కియా మోటార్స్ శాంచురీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. వాటన్నింటినీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

అమరావతి అనంతపురం ఎక్స్ ప్రెస్ వే తీసుకొచ్చాం. నాడు అభివృద్ధికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే.. వీళ్లు ఆ పనులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయాన్ని నాశనం చేశారు. ఇది సరిపోదు అన్నట్లు దుర్మార్గాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. నిన్నటికి నిన్న కియా పరిశ్రమ వద్ద పెట్రోల్ బంక్ ఇష్టానుసారంగా పెట్టి ప్లాంట్ యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు.

సంక్షేమ పథకాల విషయంలో కూడా వివక్ష చూపిస్తున్నారు. కరోనాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క జిల్లాలో 50వేలకు పైగా కేసులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదంటారా.?

వేరుశనగ రైతులు పంట సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో విత్తనాలు కూడా ఇవ్వలేకపోవడం దారుణం కాదా.? ఆరుగురు రైతులకు చెందిన చీనీ చెట్లు నరికివేయడం, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడడం, అక్రమ కేసులు పెట్టడం, ఆస్తులు ద్వంసం చేయడం వంటి వందలాది ఘటనలు చూశాం. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక హద్దు ఉంటుంది.

వీల్లు చేసే తప్పుడు పనులు హద్దు దాటిపోయాయి. దౌర్జన్యాలు పెచ్చుమీరి పోయాయి. ఇళ్ల స్థలాల విషయంలో చేస్తున్నఅక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. వాటిని రాజకీయ పార్టీగా మరింత ప్రచారం చేయాలి. ఇళ్ల స్థలాల విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలు, పనికిమాలిన భూముల్లో ఇస్తున్న ఇళ్ల పట్టాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.

ప్రభుత్వం చేసే దుర్మార్గాల విషయంలో ప్రతిపక్షంగా మనపై అత్యంత బాధ్యత ఉంది. అమూల్యమైన సంపద కలిగిన రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా తయారు చేశారు. ఆదాయం సంపాదించాల్సిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఏడాదిలో లక్ష కోట్ల అప్పు చేశారు. ఏడాదికి లక్ష కోట్ల ఆదాయం సృష్టించే అమరావతిని చంపేశారు.

లంచాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయదలిచారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ లోనూ మనం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తే..  వీళ్లు అభివృద్ధిని నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. మనపై అనితర బాద్యత ఉంది. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అన్ని సామాజిక వర్గాలను పరిశీలిస్తున్నాను.  ఏ ప్రాంతంలో ఎవరి నాయకత్వం ఎప్పుడు అవసరమో గుర్తించి.. వారికి బాద్యతలు అప్పగిస్తాను. అందరం కలిసి మళ్లీ మనం అధికారంలోకి వచ్చేలా పరిశ్రమిద్దాం. రాష్ట్ర అభివృద్ధిని కొనసాగించుకుందాం" అని పేర్కొన్నారు.