శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (13:17 IST)

ఎందుకయ్యా.. పరమానందయ్య శిష్యుల్లా చెప్పుకుని తిరుగుతారు..? సభలో నవ్వులే నవ్వులు

ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా సర్కారు ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలోకి ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వెళ్లిపోయారు. ప్రతిపక్ష నేతగా మారిన బాబుకి ఇప్పటికే చంద్రబాబు కాన్వాయ్‌లో పైలట్, ఎస్కర్ట్ వాహనాలను తొలగించారు. ఇవి చాలవన్నట్లు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు మరో చేదు అనుభవం ఎదురైంది. 
 
జడ్‌ప్లస్ కేటాగిరి భద్రతలో ఉన్న చంద్రబాబును సాధారణ ప్రయాణికుల వలే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ సీఎంను సాధారణ ప్రయాణికుడిలా తనిఖీలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. టీడీపీ నేతలు వైకాపా సర్కారును ఏకిపారేశారు. 
 
ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ సాగింది. గన్నవరం అంశంపై మాట్లాడుతూ.. వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై సెటైర్లు విసిరారు. చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేయగానే పరమానందయ్య శిష్యుల్లా.. ప్రతీ చోట ఇలా చెప్పుకోవడం వల్లే ఆయనకు అవమానం జరిగిందని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి చూస్తే.. టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల్లా తయారయ్యారని.. గన్నవరం వ్యవహారం జరగ్గానే సుబ్బారావు, వెంకటరావు గార్లు మా లీడర్‌కు అవమానం జరిగిందని.. నిద్రపోయేవారిని కూడా లేవగొట్టి మరీ చెప్పారు. 
 
అసలు చంద్రబాబుకు అవమానం జరగలేదు. టీడీపీ నేతలు పరమానంద శిష్యుల్లా చెప్పుకుని తిరగడం వల్లే ఆయన అవమానం తప్పలేదని అంబటి వ్యాఖ్యానించారు. అంబటి టీడీపీ నేతలను పరమానందయ్య శిష్యులతో పోల్చడంతో అసెంబ్లీ సీఎం జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుల్లో మునిగిపోయారు.