అంతా అయిపోయాకా.. ఓటర్ అంటూ ఇప్పుడు వస్తున్నావా నాయనా..?
మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ఓటర్. విష్ణుకు జంటగా సురభి నటించింది. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదమైంది. హీరో విష్ణు తనను వేధిస్తున్నారంటూ చిత్ర దర్శకుడు జి.ఎస్.కార్తీక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా దర్శకుల సంఘంలో కూడా ఫిర్యాదు చేసారు. అయితే.. ఈ సినిమా కథ మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ని పోలి ఉందని, కాబట్టి స్టోరీ హక్కుల కింద రూ.1.5 కోట్లు చెల్లించాలని విష్ణు వేధిస్తున్నట్టు కార్తీక్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారమే రేపాయి.
అయితే విష్ణు, కార్తీక్ రెడ్డి మధ్య జరిగిన ఒప్పందం గురించి తనకు తెలీదని.. తనను ఇప్పుడు డబ్బులు కట్టమనడం అన్యాయమని నిర్మాత జాన్ సుధీర్ పూదోట కూడా అన్నారు. ఇక ఈ సినిమా విడుదల అసాధ్యమే అనుకున్న తరుణంలో రిలీజ్ డేను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సోషల్ మెసేజ్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది.
విష్ణు దేశ భక్తి కలిగిన యువకుడిగా, సమాజంపై బాధ్యత కలిగిన వ్యక్తిగా కనిపిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాడే ఓటర్ అని నమ్మే వ్యక్తిగా విష్ణు కనిపించనున్నారు. ఈ చిత్రంలో సంపత్ రాజ్, నాజర్, ప్రగతి, బేసన్ నగర్ రవి ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చారు. అయితే... ఎన్నికల సమయంలో ఈ సినిమా రిలీజ్ అయితే బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు రిలీజ్ చేస్తుండడంతో అంతా అయిపోయాకా వస్తున్నావా నాయానా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి.. ఓటర్‌కి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి..!