నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు
నరకం చూపిస్తా నాయాలా... అంటూ ప్రభుత్వ విద్యుత్ శాఖ ఉద్యోగిపై వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తావా? ఎంత ధైర్యం నీకు... నిన్ను కోర్టుకులాగుతా... ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో... అసలు టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరంలో దువ్వాడకు ఓ ఇల్లు ఉంది. గత మూడు నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో రూ.56,692 బకాయి ఉంది. అదే ఇంటికి డి.మాధురి పేరుతో ఉన్న కనెక్షన్‌కు మాత్రం బిల్లు చెల్లిస్తున్నారు. అయితే, దువ్వాడ పేరున ఉన్న కనెక్షన్‌కు మాత్రం బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకునిపోయాయి. దీంతో శుక్రవారం విద్యుత్ సిబ్బంది దువ్వాడ ఇంటికి వెళ్లి ఆ కనెక్షన్ తొలగించింది.
ఈ విషయం తెలిసిన దువ్వాడ వెంటనే టెక్కలి విద్యుత్ శాఖ ఏఈ మురళీమోహన్ రావుకు ఫోన్ చేసి బూతు పురాణం లంఘించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనెక్షన్ కట్ట చేస్తారని, ఎవరి ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేచేసారో తెలుసా? అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఒక ఎమ్మెల్సీ ఇంటికొచ్చి కనెక్షన్ కట్ చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా అంటూ హెచ్చరించారు. పేమెంట్ అయిపోయి వారం రోజులు అయిందని, ఏ రైట్స్‌తో కట్ చేశావో చెప్పాలని డిమాండ్ చేశాడు. నీకు నరకం చూపిస్తా.. టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా. టెక్కలి వదిలి పారిపోయేలా చేస్తానని బెదిరించారు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యీ బకాయి మొత్తం చెల్లించడంతో కనెక్షన్ పునరుద్ధరించినట్టు ఏఈ తెలిపారు.