వైకాపాకు ఎదురుదెబ్బలు : సీఎం జగన్‌కు వైమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టాటా!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తుంది. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్రంలోని అధికార వైకాపాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈయన నేడో రేపే పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు.
ఆ తర్వాత ఆయన తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా, రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని గతంలో వేమిరెడ్డి ప్రకటించారు. అయితే, ఆతర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తనకు టిక్కెట్ దక్కే అవకాశం లేదని భావించి పార్టీ మార్పునకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.
కాగా, ఇటీవల నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఖలీల్‌ను సీఎం జగన్ నియమించారు. దీన్ని వేమిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆయన వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పైగా, గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన జీర్ణించుకోలేక పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.