మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (08:33 IST)

కియాపై వైసీపీ అప్పుడలా.. ఇప్పుడిలా..

ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ ఏర్పాటుపై వైసీపీ మళ్లీ నాలుక మడతేసింది. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలో పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఒక కారును కూడా విడుదల చేశారు.

అయితే అప్పట్లో ఈ పరిశ్రమ ఏర్పాటును వైసీపీ ఎద్దేవా చేసింది. కార్లు అమ్ముడుపోని కారణంగా చైనాలోని ఫ్లాంట్లను కియా మూసేసికుందంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యంగ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 
 
కమిషన్ల కక్కుర్తితోనే కియాకు చంద్రబాబు రూ. రెండువేల కోట్ల రాయితీలు ఇచ్చారని కూడా విజయసాయి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. తద్వారా కియా ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పకనేచెప్పారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ మాట మార్చింది.

12ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు కోసం వైఎస్ కృషి చేశారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి కియా సీఈవో రాసినట్టు చెప్పిన లేఖను కూడా మంత్రి బుగ్గన విడుదల చేశారు. దీంతో కొన్ని రోజులపాటు టీడీపీ, వైసీపీ మధ్య కియాపై మాటలయుద్ధం నడిచింది.
 
తాజాగా కియా మోటార్స్ ఫ్లాంట్‌ను గురువారం సీఎం జగన్ ప్రారంభించారు. కియా మోటార్స్ బాటలోనే మరికొన్ని కంపెనీలు ఏపీకి రావాలని, వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కియా కార్లపరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాష్ట్రంలో ఏర్పాటు కావడం శుభపరిణామమని అన్నారు. ఒకప్పుడు ఇదే కంపెనీపై విజయసాయి ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేస్తే.. ఇప్పుడు జగన్ కియాకు కితాబిచ్చారు. దీంతో కియాపై వైసీపీ కపటబుద్ధి బయటపడిందంటూ టీడీపీ విమర్శిస్తోంది.