1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (18:04 IST)

విభజన హామీలను నెరవేర్చాలని కోరాం.. వైఎస్ జగన్..!

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీలోని రేస్ కోర్స్‌లోని మోడీ నివాసానికి పార్టీ ఎంపీలతోపాటు వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా విభజన హామీలను నెరవేర్చాలని మోడీని కోరినట్టు తెలిపారు.
 
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పైన ప్రధానితో చర్చించామని చెప్పారు. ప్రాజెక్టుల అమలులో తమ భయాలు వెల్లడించామన్నారు. స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం సకాలంలో పూర్తి చేయాలని తాము ప్రధానిని కోరామన్నారు.
 
అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు తదితర అంశాలను మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్లు జగన్ వెల్లడించారు. ప్రధాని సమస్యలను పరిష్కరిస్తారని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.