1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 13 జూన్ 2024 (15:31 IST)

యాత్ర-2కు సిద్ధం.. దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించనున్న జగన్!!

ys jagan
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. గతంలో తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన కార్యకర్తలు, నేతల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఓదార్పు యాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇపుడు ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. గత ఐదేళ్ల కాలంలో అనేక సంక్షేమ ఫలాలు అందించినప్పటికీ వైకాపా ఓడిపోయింది. ఈ ఓటమిని ఓ ఒక్క వైకాపాకు చెందిన నిజమైన కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా, ఈ ఫలాలు జగన్‌కు కూడా ఏమాత్రం మింగుడుపడటం లేదు. 
 
దీంతో ఆయన రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని సంకల్పించారు. ఇందుకోసం త్వరలోనే జనంలోకి వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. పోలింగ్, కౌంటింగ్ తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన కార్యకర్తలను ఆయన పరామర్శిస్తారని తెలుస్తుంంది. ఈ నేపథ్యంలో రోజూ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా కొన్ని కమిటీలు వేసినట్టు సమాచారం.