గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:59 IST)

మళ్లీ మడమ తిప్పిన జగన్.. ఎమ్మెల్సీ టిక్కెట్ల హామీలపై వెనక్కి...

శాసనసభ్యుల కోటా శాసనమండలి అభ్యర్థుల పేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించగానే.. ఆ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు తీవ్ర ఆశాభంగం చెందారు. వీరంతా కొత్తగా ఈ పదవులు ఆశించినవారు కాదు. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన నుంచి హామీ పొందినవారే. 
 
ఆయన గద్దెనెక్కి ఇరవై నెలలు కాగా.. ఎమ్మెల్సీల భర్తీ అవకాశాలు పలు సార్లు వచ్చినా.. మాట నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారిని కాదని.. కొత్తగా చేరినవారికి 2019 ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చారని.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కూడా అలా వచ్చినవారికే ఇస్తున్నారని బాధపడుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. 
 
ఎవరెవరికి జగన్‌ హామీలిచ్చారో గుర్తుచేసుకుంటున్నాయి. విజయనగరం జిల్లాలో జగన్‌ పాదయాత్ర నిర్వహించిన సమయంలో స్వర్ణకార కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టికెట్‌ను లేళ్ల అప్పిరెడ్డికే ఇస్తానని పలుసార్లు ప్రకటించినా.. చివరి నిమిషంలో ఆయన్ను మార్చి ఏసురత్నాన్ని బరిలోకి దించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పుపై అప్పిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జగన్‌ వారిని అనునయించి.. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని రోడ్‌షోలో ప్రకటించారు. ఎమ్మెల్సీ ఖాళీలు వస్తున్నా.. ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్‌ పోటీ చేస్తారని వైసీపీ ముఖ్య నేతలు, జగన్మోహనరెడ్డి ప్రకటిస్తూ వచ్చారు. 
 
కానీ టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనికి టికెట్‌ను ఇచ్చారు. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవినీ ఇస్తానని ఎన్నికల ప్రచార సభలోనే జగన్‌ ప్రకటించారు. ఈ హామీ ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదని వైకాపా నేతలు వాపోతున్నారు.