బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (18:01 IST)

ఊరూరా రాజారెడ్డి రాజ్యాంగం : అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చోడవరం గ్రామ సచివాలయం పైనున్న జగన్‌ వాల్‌పోస్టర్‌ను చించారనే నెపంతో గ్రామంలో కూడా లేని తెలుగుదేశంపార్టీ సానుభూతిపరులు బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలను అక్రమంగా అదుపులోకి తీసుకుని కోర్టుకు కూడా హాజరుపరచకుండా నాలుగు రోజులుంచి చిత్రహింసలకు గురిచేయడం దుర్మార్గంమని మండిపడ్డారు. 
 
ఎటువంటి సంబంధంలేని వ్యక్తులను అదుపులోకి తీసుకుని వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగమా? ఎన్నికల కౌంటింగ్‌ రోజు జగన్‌ వాల్‌పోస్టర్‌ చించితేనే హడావుడి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై భౌతిక దాడులకు దిగిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎటువంటి ఆధారాలు లేకుండా తెదేపా కార్యకర్తలను ఎలా అదుపులోకి తీసుకుంటారు? 
 
కోర్టుకు కూడా హాజరుపరచకుండా ఏ విధంగా స్టేషన్‌లో ఉంచుతారు? బోడ కృష్ణ, నిమ్మగడ్డ చైతన్యలకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. వెంటనే తెదేపా కార్యకర్తలను వదిలిపెట్టి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.