వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి టూర్ షెడ్యూల్ ఇదే...
వైసీపీ అఖండ విజయం సాధించిన నేపధ్యంలో మరికొద్ది గంటల్లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేటి సాయంత్రం 6.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు.
ఈ రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బసచేస్తారు. రేపు ఉదయం 8.15 గంటలకు శ్రీవారిని దర్శించుకుని 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి 11.00 గంటలకు కడప చేరుకుంటారు. 11.30 నుండి 11.45 వరకు కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం 12.15 గంటలకు కడప నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు.
అక్కడ సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 1.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 4.30 వరకు ఇడుపులపాయలో గడిపి 4.30 గంటలకు ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లిలో తమ నివాసానికి చేరుకుంటారు.