వైకాపాకు షాకిచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైకాపాకు, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేరుకోలేని షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు... 2019 నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయతీగా ఎమ్మెల్యేగా పని చేశానని... ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానన్నారు.
ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. తనకు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెపుతున్నానని చెప్పారు. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ... కఠినమైన నిర్ణయం తీసుకోవాలనిపించి రెండు నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. ఒకటి మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనేది, రెండోది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది అని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను ఆయన మీడియాకు చూపించారు.
రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేశానని... తన రాజీనామాను నేరుగా ఇద్దామని స్పీకర్ కార్యాలయానికి వెళ్లాలని... అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్డీకి లేఖను అందజేశానని ఆర్కే తెలిపారు. తన రాజీనామాను అందించాలని కోరానని చెప్పారు. 1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్‌గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద పని చేస్తూ 2004లో సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడ్డానని, 2009లో పెదకూరపాడు సీటును ఆశించి మళ్లీ భంగపడ్డానని చెప్పారు. అయినప్పటికీ వైఎస్సార్‌ను కానీ, కాంగ్రెస్‌ను కానీ ఒక్కమాట కూడా అనలేదని తెలిపారు.
ఆ తర్వాత వైసీపీని జగన్ స్థాపించారని, ఆయన ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని ఆర్కే వివరించారు. ఎమ్మెల్యేగా తనకు జగన్ రెండు సార్లు అవకాశం కల్పించారని... ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన వ్యక్తిగత కారణాలవల్ల ఈరోజు తన శానససభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. రాజనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు బదులుగా... త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానని అన్నారు.