సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (15:31 IST)

పవన్ కళ్యాణ్ ఓ బ్రోకర్ : వైకాపా నేత సి. రామచంద్రయ్య

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేత సి.రామచంద్రయ్య తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీకి - భారతీయ జనతా పార్టీకి మధ్య పవన్ కళ్యాణ్ ఓ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రెండు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులు, రాజధాని మార్పుపై చర్చించారు. దీనిపై రామచంద్రయ్య మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్టు అని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ మధ్య పవన్ బ్రోకర్‌లా తయారయ్యారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై చాడీలు చెప్పడానికే పవన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారంటూ ఆరోపించారు. 
 
పవన్ చెప్పిన విషయాలు విన్న జేపీ నడ్డా అన్నీ తమకు తెలుసని చెప్పారని గుర్తుచేశారు. అప్పట్లో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని కేంద్రంపై ధ్వజమెత్తిన పవన్ ఇప్పుడెందుకు బీజేపీ పెద్దలను కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తూ రాజధాని రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారంటూ పవన్‌పై రామచంద్రయ్య మండిపడ్డారు.