గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (15:22 IST)

ఉద్రిక్తంగా కాకినాడ.. పవన్ రాకతో 144 సెక్షన్ అమలు

కాకినాడ పట్టణం ఉద్రిక్తంగా మారింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకుని పట్టణవ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే ఎటువంటి ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు, తమ పార్టీ అధినేత కోసం జనసేన నేతలంతా తరలివస్తున్నారు. దీంతో కాకినాడ వ్యాప్తంగా గట్టిబందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
ఇటీవల పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఇంటిని ముట్టడించేందుకు జనసైనికులు బయలుదేరారు. అయితే, వైకాపా శ్రేణులు తిరగబడి జనసైనికులపై రాళ్ళదాడి చేశారు. ఈ దాడిలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు పవన్ మంగళవారం కాకినాడకు బయలుదేరారు. 
 
ఈ నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, నగరంలో 144 సెక్షన్ ను విధించారు. మరోవైపు, విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో కాకినాడకు వస్తున్న పవన్ కల్యాణ్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోబోమని, ఆయనను అరెస్టు చేయబోమని జిల్లా ఎస్పీ నయీం హస్మీ ప్రకటించినప్పటికీ... పోలీసులు మాత్రం పవన్ పర్యటనకు అడుగడుగునా ఆటంకాల కల్పిస్తున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.