శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (15:48 IST)

చిటికేసి చెబుతున్నా... అధైర్యపడొద్దు... ఎవరూ ఏం పీకలేరు : వైకాపా ఎంపీ

రాష్ట్ర ప్రజలకు అధికార వైకాపాకు చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు ధైర్య వచనాలు చెప్పారు. ఏ ఒక్కరూ భయపడొద్దనీ, చిటికేసి చెబుతున్నా ఎవరూ ఏం చేయలేరని అన్నారు. 
 
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పీపీఈ కిట్లు లేవని ఎప్పుడో కామెంట్ చేస్తే డాక్టర్ గంగాధర్ లాంటి ప్రముఖ వైద్యులకు ఇప్పుడు సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు. నోరు విప్పితే భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా, మృధుభాషిగా డాక్టర్ గంగాధర్‌కు పేరుందని రాజు గుర్తుచేశారు. 
 
అలాగే, చిత్తూరులో 'ఓ దళిత యువకుడు మద్యం దందాపై మాట్లాడితే.. ఆ వ్యక్తిని సాక్షాత్ ఓ మంత్రి అనుచరులు, వైకాపా కార్యకర్తలు చంపుతామని బెదిరించారని వార్తలు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాణాలు తీసుకోవడం బాధాకరం దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
అంతేకాకుండా, నాకూ బెదిరింపులు వస్తున్నాయి. ఎవరూ చలించకండి. ఎవర్నీ ఎవరూ ఏమీ చేయలేరు. ధైర్యంగా ఎదుర్కొంటే ఏమీ కాదు. నన్ను సోషల్ మీడియాలో ఓ మహిళా మూర్తి రకరకాలుగా మాట్లాడారు. ఆడవాళ్లు మాట్లాడాల్సిన మాటలే కావవి. ఎన్నిరకాలుగా ఏం చేసినా.. ఏం ప్రయోజనం లేదని ఆయన చెప్పుకొచ్చారు.