1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (12:47 IST)

తెలుగు ప్రజల కోసమే బీజేపీని ఓడించారు. ఆర్ఆర్ఆర్

raghuramakrishnamraju
కర్నాటక ప్రజలు తెలుగు ప్రజలకు మేలు చేశారని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తెలుగు ప్రజల కోసమే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ పెద్దలు చేరదీసి అన్ని విధాలుగా సహకరిస్తున్నారని, ఇదే కర్నాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలిపారు. అందుకే బీజేపీని చిత్తుగా ఓడించారన్నారు. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తెలుగు వారి కోపమే కారణం. ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో అక్కడ బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. కోస్టల్ కర్ణాటక మినహా, మిగతా ప్రాంతాలలో తెలుగువారు అత్యధికంగా ఉన్నారు. ఏపీకి అన్యాయం చేస్తూ, ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నాయకత్వం తెలిసో తెలియకో చేరదీస్తోందన్న అపోహ వల్లే బీజేపీకి వారంతా వ్యతిరేకంగా ఓటు వేశారు అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 
 
కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ, 'ప్రజల్లో నెలకొన్న ఈ అపోహను దూరం చేసుకోకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీ నాయకత్వం మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రుణపడి ఉండాలి. త్వరలో ఏపీలో ఏర్పడేది ప్రజా ప్రభుత్వమే. 
 
తెలుగుదేశం, జనసేన పార్టీలో మధ్య ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. మూడో పార్టీతో కూడా పొత్తు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఒకటి రెండు చానెల్ని అడ్డం పెట్టుకుని పవన్ సీఎం అంటూ తప్పుడు ప్రచారాన్ని చేసేవారు, దాని విషయంలో ఆయన చేసిన విస్పష్ట ప్రకటనతో వారు వణికి పోతున్నారు' అని అన్నారు.