1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కర్నాటక ఫలితాలతో హస్తినలో మారిన సీన్.. బీజేపీయేతర నేతల భేటీ

congress flag
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సంఘటితమయ్యే అవకాశాలు ముమ్మరమయ్యాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కన్నడనాట ఫలితాలతో ఆత్మవిశ్వాసం ఇనుమడించిన కాంగ్రెస్ చొరవతో త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల నేతల సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 
 
కర్ణాటక కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీయేతర పార్టీల నేతలకు ఆహ్వానం లభిస్తుందని, ఈ కార్యక్రమంతో ప్రతిపక్ష నేతలు సంఘటితమవడానికి పునాది ఏర్పడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గత నెలలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలుసుకున్న తర్వాత ప్రతిపక్ష నేతలను సంఘటితం చేసే కార్యాచరణకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 
 
ఆ తర్వాత నీతీశ్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు పలువురు నేతలను కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండేందుకు బీజేపీ అభ్యర్థులకు పోటీగా ఒకే ఒక ప్రతిపఅభ్యర్థిని నిలబెట్టడం గురించి కూడా ఆయన ప్రతిపాదించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలకు సారథ్యం వహించమని కోరారు. 
 
ఇపుడు కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ విశ్వసనీయత పుంజుకుందని, దీంతో బీజేపీ వ్యతిరేక పార్టీలు చేతులు కలిపేందుకు నీతీశ్ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సంఘటితం అయ్యేందుకు ప్రేరణ ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 
 
నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో ఊపిరి వచ్చిందని, దేశంలో ప్రతిపక్ష కూటమిని కాంగ్రెస్ లేకుండా నిర్మించలేమనే అభిప్రాయానికి అస్కారం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల రీత్యా కాంగ్రెస్ స్థానం జాతీయ రాజకీయాల్లో మరింత సుస్థిరమైందని, కాంగ్రెస్ పార్టీను ఎవరూ తుడిచిపెట్టలేరనే అభిప్రాయం లంగా ఏర్పడుతోందని వారు భావిస్తున్నారు.