మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 జూన్ 2023 (23:18 IST)

సర్వాంగ స్నానము ఎలా చేయాలి? ఫలితాలు ఏమిటి?

మెడ నుంచి కిందవరకూ చేసే కంఠ స్నానం, తల నుంచి కింది వరకూ చేసే శిరఃస్నానాలను సర్వాంగ స్నానం అంటారు. ఈ స్నానానికి చన్నీళ్లు ఉపయోగిచడం మంచిది, చన్నీళ్లు సరిపడనివారు గోరువెచ్చని నీటితో చేయవచ్చును. సర్వాంగ స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాము. మెత్తని టర్కీ టవల్, ఒక బకెట్ చల్లటి నీరు లేదా గోరువెచ్చటి నీరు, సున్నిపిండి లేక పెసర, మినపి పిండి సిద్ధం చేసుకోవాలి.
 
టర్కీ టవల్‌ను బకెట్లో ముంచి కొద్దిగా పిండుకోవాలి, ఆ టవల్‌తో శరీరమంతా గట్టిగా రుద్దుకోవాలి.
ముఖము, ఛాతీ, పొట్ట, వీపు, కాళ్లూ-చేతులు ఇలా శరీరమంతటినీ టవల్‌తో రుద్ది స్నానం చేయాలి.
స్త్రీలైతే తల భాగం మినహాయించి మిగతా శరీర భాగాలు, అవయవాలు మొత్తం రుద్ది స్నానం చేయాలి, పురుషులు తలతో సహా చేయాలి.
 
శరీరం అంతా ఇలా రుద్దటం పూర్తయ్యాక సున్నిపిండితో ఒళ్లంతా రుద్దుకుని ఒక బకెట్ నీటితో స్నానం చేయాలి. ప్రకృతి వైద్య విధానం ప్రకారం ఏ స్నానమైనా అర్థగంటలోపలే పూర్తి చేయాలి. ఎక్కువసేపు నీటిలో నానరాదు. సర్వాంగ స్నానం వల్ల బాహ్య, అంతర్గతము అనే కాకుండా సమస్త దేహావయవాలన్నీ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. గమనిక: సర్వాంగ స్నానం వ్యాధిగ్రస్తులు ఆచరించే ముందు ప్రకృతి వైద్యుని సలహా తీసుకోవాలి.