తులసీ దివ్యౌషధ రూపిణి.. ఆ ఆకులతో టీ సేవిస్తే?
అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి ఒకటి. ఈ మొక్కను లక్ష్మీదేవిగా పూజిస్తారు. శ్రేయస్సుకు తులసి చిహ్నం. తులసి మొక్క మంచి క్రిమిసంహారక, యాంటీ ఆక్సిడెంట్. దాని ఆకుల నుండి దాని మూలాల వరకు ఔషధ గుణాలు ఎన్నో వున్నాయి.
వివిధ ఆరోగ్య సమస్యలను తిప్పికొట్టేగల శక్తి తులసీలో వుంది. జలుబు, ఫ్లూకి తులసి మంచి మందు. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి అందులో తగినంత బెల్లం, కలుపుకుని టీలా తాగితే జలుబు తగ్గుతుంది. తులసి వల్ల మొటిమల వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని మొటిమలపై రాస్తే మొటిమలు మాయమవుతాయి.
తులసి ఆకులను నమలడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ పెరుగుతుంది. తులసి, నిమ్మరసం కలిపి మెత్తగా నూరి రాసుకుంటే పురుగు కాటు బెడద తొలగిపోతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే గొంతునొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది.
తులసి ఆకుల రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం ఒక చెంచా తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. తులసి వేరును పురుగు కాటుపై పూయడం చాలా మంచిది. ఈ తులసీ నోటి దుర్వాసన వంటి సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.