శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 21 డిశెంబరు 2021 (13:28 IST)

హంసానందినికి క్యాన్సర్: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా? మామోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలి?

'అత్తారింటికి దారేది', 'మిర్చి' లాంటి సినిమాల్లో నటించిన హంసా నందిని రొమ్ము క్యాన్సర్ బారిన పడినట్లు ఆమె తన సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె క్యాన్సర్‌తో చేస్తున్న పోరాటం గురించి సుదీర్ఘమైన పోస్టు ద్వారా వివరించారు. ఆమెకొచ్చిన క్యాన్సర్ జన్యుపరమైన మ్యుటేషన్‌తో కూడుకుని ఉండటం వల్ల చికిత్స పూర్తయిన తర్వాత కూడా 70% క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉందని రాశారు.

 
జన్యుపరమైన క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే 'ఏంజెలీనా జోలీ ఎఫెక్ట్' అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీకి క్యాన్సర్ వచ్చిందని తేలక ముందే ఆమె రెండు రొమ్ములను తొలగించుకున్నారు. ఆమె తల్లి క్యాన్సర్‌తో మరణించిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

 
తల్లి మరణం తర్వాత ఏంజెలీనా శరీరంలో బిఆర్‌సిఏ-1 జీన్ మ్యుటేషన్ ఉందని తేలింది. దాంతో, ఆమెకు కూడా 87% శాతం రొమ్ము క్యాన్సర్, 50% అండాశయ క్యాన్సర్ సోకే అవకాశాలు ఉన్నాయని గుర్తించి 2013లో రొమ్ము, అండాశయాలు తొలగించే శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈమె తీసుకున్న నిర్ణయం తర్వాత జన్యు పరీక్షలు చేయించుకునేవారి శాతం పెరిగినట్లు హార్వర్డ్ మెడికల్ స్కూల్ 2016లో ప్రచురించిన ఒక వ్యాసంలో పేర్కొంది. ఇది 'ఏంజెలీనా జోలీ ఎఫెక్ట్‌'గా ప్రాచుర్యం కూడా పొందింది. హంసా నందిని కూడా తనకు జన్యుపరమైన క్యాన్సర్ సోకిందని పేర్కొన్నారు.

 
క్యాన్సర్ అంటే ఏంటి?
నియంత్రణ లేకుండా కణ విభజన జరిగినప్పుడు క్యాన్సర్ సోకుతుంది. కణ విభజనపై శరీరం నియంత్రణ పోగానే అది క్యాన్సర్ రూపంలో బయటపడుతుందని, విశాఖపట్నానికి చెందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ మురళీ కృష్ణ చెప్పారు.
శరీరంలో కణ విభజనను నియంత్రణ చేయడానికి ట్యూమర్ సప్రెస్డ్ జన్యువులు ఉంటాయి. ఇవి నియంత్రణ కోల్పోయినప్పుడు క్యాన్సర్ సోకుతుందని వివరించారు.

 
క్యాన్సర్‌లలో రొమ్ము, పొట్ట, పెద్ద పేగు, అండాశయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ల లాంటివి అనేక రకాలుంటాయి. "భారత మహిళల్లో అత్యధికంగా వచ్చే క్యాన్సర్‌లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. మామోగ్రామ్ ఆవిర్భావంతో 30 - 40% రొమ్ము క్యాన్సర్‌లు ప్రాథమిక దశలోనే బయటపడుతున్నాయి. 30% మాత్రం ఆఖరు దశలో బయటపడుతున్నాయని రేడియేషన్ ఆంకాలజిస్ట్ యుగంధర్ శర్మ చెప్పారు.

రొమ్ము క్యాన్సర్ సోకినట్లు కనిపెట్టడం ఎలా?
వ్యాధి లక్షణాలు లేకుండా వ్యాధి ఉందో లేదో చూసుకునే ప్రక్రియను స్క్రీనింగ్ అంటారు. రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టేందుకు చేసే స్క్రీనింగ్ పరీక్షను మామోగ్రామ్ అంటారు. రొమ్ము ఆకారంలో, పరిమాణంలో మార్పులు, రొమ్ము బాగా కుంచించుకుపోయినా, చనుమొనల నుంచి రక్తం లేదా ఇతర రంగులో ఉన్న ద్రవం లాంటిది వస్తున్నా, దద్దుర్లు వచ్చినా, చర్మం రంగులో తేడా వచ్చినా డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిదని సూచించారు.

 
ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు మామోగ్రామ్ పరీక్షలు చేయించాలని చెప్పారు. మామోగ్రామ్ ద్వారా రెండు రొమ్ములకు తక్కువ డోసులో ఎక్స్‌రే తీస్తారు. 40 ఏళ్ళు పైబడిన మహిళలందరూ ఈ మామోగ్రామ్ పరీక్ష రెండేళ్లకొకసారి చేయించుకోవడం మంచిది. ప్రతీ పుట్టిన రోజుకు ఒక కేక్ కట్ చేసినట్లే, మామోగ్రామ్ పరీక్షలను కూడా ఏడాదికొకసారి లేదా రెండేళ్ళకొకసారి చేయించుకోవడం మంచిదని సూచించారు. దీని వల్ల చేతికి తగలని గడ్డలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ యుగంధర్ శర్మ చెప్పారు.

 
క్యాన్సర్ రావడానికి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యత, హార్మోన్ల ప్రభావం కూడా కారణం కావచ్చని డాక్టర్ మురళీకృష్ణ చెప్పారు. "స్ట్రీల హార్మోన్లలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. 11-12 ఏళ్లకే రుతుక్రమం మొదలైన అమ్మాయిల్లో స్త్రీలకు సంబంధించిన హార్మోన్ల ప్రభావం ఉంటుంది. రుతుక్రమం ఎక్కువ కాలం కొనసాగిన వారికి హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అటువంటి వారికి కూడా ముప్పు ఎక్కువగా ఉంటుంది" అని గతంలో డాక్టర్ శైలజ చందు బీబీసీ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశంలో ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే క్యాన్సర్లు ఎక్కువని, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు తక్కువని, కానీ, వాటిలో ఎక్కువగా రొమ్ము, అండాశయ క్యాన్సర్లు ఉన్నాయని డాక్టర్ మురళీకృష్ణ అన్నారు.

 
జన్యుపరమైన మ్యుటేషన్ అంటే ఏంటి?
మన శరీరంలో అనేక రకమైన జన్యువులుంటాయి. వాటిలో జరిగే మార్పులను మ్యుటేషన్ అంటారు. రొమ్ము క్యాన్సర్ సోకిన రోగి శరీరంలో బిఆర్‌సి‌ఏ 1,2 జన్యువులలో మార్పులు ఉంటే, దానిని వంశపారంపర్యంగా వచ్చిన క్యాన్సర్‌గా గుర్తిస్తామని డాక్టర్ యుగంధర్ వివరించారు. అందుకు ఉదాహరణ చెబుతూ ఇద్దరు 40- 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులకు రొమ్ము క్యాన్సర్ వచ్చినా కూడా వంశపారంపర్య చరిత్రలో క్యాన్సర్ సోకినట్లు తెలిసినపుడే జన్యు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

 
"బిఆర్‌సిఏ 1,2 జన్యుపరమైన మ్యుటేషన్లు ఉన్నట్లు తెలిస్తే, 60 నుంచి 80 శాతం రొమ్ము క్యాన్సర్, 30 - 45 శాతం అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండవచ్చు" అని చెప్పారు. "రెండు మ్యుటేషన్లు ఉంటే కూడా వేరే రకమైన క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి" అని తెలిపారు. హంసనందిని ఇదే విషయాన్ని తన పోస్టులో రాశారు.

 
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతీ 100 మందికి క్యాన్సర్ సోకితే అందులో 5 - 10% వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అయితే, "భారతదేశంలో వంశపారంపర్య క్యాన్సర్ వచ్చే అవకాశాలు తెలుసుకునేందుకు అవసరమైన వనరులు లేకపోవడంతో తగినంత డేటా అందుబాటులో లేదు" అని అంటారు.

 
ఈ పరీక్షలను క్యాన్సర్ సోకిన రోగులందరికీ చేస్తారా?
ఈ పరీక్షలను క్యాన్సర్ సోకిన రోగులందరికీ చేయవలసిన అవసరం లేదని చెబుతూ, రోగికి మామోగ్రామ్ పరీక్షలో రొమ్ము క్యాన్సర్ అని తెలిసిన తర్వాత, బయాప్సి, ఇతర పరీక్షల ఆధారంగా చికిత్స మొదలుపెట్టే అవకాశం ఉంటుందని డాక్టర్ యుగంధర్ వివరించారు. ఈ దశలోనే రోగి వయసు, క్యాన్సర్ రకం, దశతో పాటు రోగి కుటుంబ ఆరోగ్య చరిత్ర తెలుసుకోవడం అవసరం అని చెప్పారు.


రోగి ఫస్ట్ డిగ్రీ బంధువులు (తల్లి, చెల్లి, తండ్రి, అక్క, కూతురు), మేనత్త లాంటి వారు సెకండ్ డిగ్రీ బంధువుల ఆరోగ్య చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకుని జన్యుపరమైన పరీక్షలు చేయాలా వద్దా అని నిర్ధరిస్తామని చెప్పారు. "భారతదేశంలో జన్యు పరీక్షలు చేయాలంటే రూ. 20,000 - రూ. 70,000 వరకు ఖరీదు చేయవచ్చు. అందుకు ప్రతీ ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహించలేం. ఇందుకు జెనెటిక్ కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ లక్షణాలు, కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టీ ఈ పరీక్షలు చేయాలా వద్దా అని నిర్ణయిస్తాం" అని డాక్టర్ మురళీకృష్ణ చెప్పారు. నటి హంస నందిని తన పోస్టులో ఆమె తల్లి కూడా క్యాన్సర్ సోకి మరణించినట్లు తెలిపారు.

 
చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది?
"సాధారణ క్యాన్సర్ సోకిన వారికి, జన్యుపరమైన మ్యుటేషన్ ఉన్న క్యాన్సర్ సోకిన వారికి చేసే చికిత్స ప్రక్రియలో తేడా ఉంటుంది" అని డాక్టర్ యుగంధర్ చెప్పారు. బిఆర్‌సి‌ఏ 1, 2 జన్యువులు గుర్తించిన ఉన్న వారికి రెండు రొమ్ములు, రెండు అండాశయాలు తొలగించడం మేలు అని చెప్పారు. ఈ సందర్భంగా ఏంజెలీనా జోలీ ఎఫెక్ట్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రాథమిక దశలో గుర్తించిన క్యాన్సర్ శరీరంలో మిగిలిన భాగాలకు పాకకుండా ఉంటే క్యాన్సర్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

 
క్యాన్సర్ జయించానని చెప్పుకోవడానికంటే ముందు సుదీర్ఘమైన, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుందని హంస నందిని కూడా తన పోస్టులో చెప్పారు. లంపెక్టమీ, కెమోథెరపీతో తన చికిత్స పూర్తయినట్లు కాదని, పూర్తి స్థాయిలో క్యాన్సర్‌తో పోరాడాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే 9 విడతల కెమోథెరపీ పూర్తి కాగా, మరో 7 విడతల కెమో చికిత్స ఉన్నట్లు చెప్పారు.

 
డాక్టర్ యుగంధర్, డాక్టర్ మురళీకృష్ణ కూడా జన్యుపరమైన మ్యుటేషన్లతో కూడిన క్యాన్సర్‌కు చేసే చికిత్స సాధారణ క్యాన్సర్ రోగి కంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. హంస నందిని పోస్టులో "ఈ రోగం నా జీవితాన్ని శాసించకూడదని, నవ్వుతూ దీనితో పోరాడి గెలుస్తానని, మరింత శక్తితో స్క్రీన్ పైకి వస్తాను" అని చెప్పారు. "జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా, అన్యాయంగా కనిపించినా కూడా నేను బాధితురాలిగా ఉండాలని అనుకోవడం లేదు. భయం, ప్రతికూలతలను నా జీవితాన్ని ప్రభావితం చేయనివ్వను. నేను పోరాడుతాను. ప్రేమ, ధైర్యంతో ముందుకు సాగుతాను" అంటూ ట్వీట్ చేశారు.

 
తన కథను పది మందికీ చెప్పడం ద్వారా క్యాన్సర్ గురించి మరింత మందికి అవగాహన కల్పిస్తానని పోస్టులో పేర్కొన్నారు. నేను జీవితం అందించే ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తానని పోస్టును ముగించారు. "ఎర్లీ స్క్రీనింగ్ మాత్రమే క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోవడానికి ఉత్తమమైన మార్గం" అని డాక్టర్ యుగంధర్ శర్మ అంటారు.