సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:34 IST)

అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు

కాబుల్ నగరం కొత్త రూపు సంతరించుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ రూపం కొత్త తాలిబాన్ నాయకుల సంకల్పం, ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. నగరంలోని అఫ్గానీల్లో ఎక్కువ మంది పేదలున్నారు. ఆకలి తీర్చుకోవడానికి సరిపడా డబ్బు సంపాదించుకోవడం ఇప్పుడు వారి ముందున్న అతి పెద్ద సవాల్.

 
అఫ్గానిస్తాన్‌కు విదేశీ సాయంగా లక్షలాది డాలర్లు అందినా అక్కడి లక్షలాది మంది ప్రజలు మాత్రం కఠిక పేదరికంలో జీవిస్తున్నారు. అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వులలో సుమారు 900 కోట్ల డాలర్లను తాలిబాన్ చేతికి వెళ్లకుండా అమెరికా స్తంభింపజేసింది. ఈ డబ్బు వినియోగంలోకి వస్తే పేదలకు సహాయపడొచ్చు.

 
పని దొరక్క పేదల ఆగ్రహం
కానీ, ఇప్పుడా నగరంలో పెద్ద భవన నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. బ్యాంకులు మూసివేశారు. విదేశీ డబ్బు వచ్చే మార్గాలు ఆగిపోయాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. కాబుల్‌లోని ఒక బహిరంగ మార్కెట్‌లో వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ప్రతి రోజూ వేకువనే వచ్చి పని కోసం చూస్తారు. అలా వచ్చినవారిలో కొందరికే పని దొరికింది. పని దొరకని మిగిలిన వారికి కోపం వస్తోంది. వారిలో ఒకరైన హయత్ ఖాన్ గత 20 ఏళ్లలో అవినీతిపరులైన నాయకులు దోచుకున్న సంపద గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
"ధనవంతులు వారి స్వలాభం కోసమే ఆలోచిస్తారు. పేదల గురించి కాదు. నేను రొట్టె కూడా కొనలేను. నన్ను నమ్మండి, నాకు ఒక్క డాలర్ కూడా దొరకలేదు. మిగిలిన ధనవంతులు పశ్చిమ దేశాల నుంచి సాయంగా అందిన డాలర్లతో వారి జేబులు నింపుకున్నారు ". "పేదల గురించి ఎవరూ పట్టించుకోరు. బయట నుంచి సాయం వచ్చినప్పుడు, అధికారంలో ఉన్న వ్యక్తులు అది పేదలకు అందకుండా, వారి బంధువులకు వెళ్లేలా చూసుకున్నారు"

 
ఏదో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ మెరుగైన స్థితిలో ఉన్న మహమ్మద్ అన్వర్ అనే వ్యక్తి ఆ తర్వాత ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ అసలు దొంగలు అమెరికన్లని ఆరోపించారు. "అల్లా పేరిట, అఫ్గాన్ ప్రభుత్వం నుంచి వారు తీసుకున్న డబ్బును మాకు ఇవ్వమని మేం అమెరికాను కోరుతున్నాం. ఆ డబ్బును అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణానికి వాడాలి" అని మహమ్మద్ అన్వర్ అన్నారు. ఆయన మాట్లాడుతుండగా.. నల్లటి గడ్డంతో ఉన్న తాలిబాన్ అధికారి జోక్యం చేసుకున్నాడు. ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు.

 
ఆ తాలిబాన్ అధికారి చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి ముప్పు నాకు కనిపించలేదు.. కానీ, వాదించడానికి అది తగిన సమయం, ప్రదేశం కాదు. అమెరికా మిలటరీ శైలిలో, సన్ గ్లాసెస్ ధరించిన ఓ తాలిబాన్ బాడీగార్డు ఆయన వెంట కాపలాగా ఉన్నాడు. ఆయన వద్ద అమెరికాలో తయారైన రైఫిల్ కూడా ఉంది. రాజధాని కాబుల్‌ మధ్యలో తాలిబాన్లు కనిపిస్తారు. విమానాశ్రయంలో వారు అమెరికన్ యూనిఫామ్‌లు ధరించారు. నగరం అంతటా వారు షల్వార్ కమీజ్, మాసిన నల్లటి తలపాగా లాంటి సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. వారందరి వద్ద రైఫిల్స్ ఉన్నాయి.

 
ఆహారం కోసం ఎంత విలువైన వస్తువైనా అమ్మేస్తున్నారు
కాబుల్‌లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పిల్లలకు తిండి పెట్టలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడానికి లక్షలాది మంది కష్టపడుతున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యుఎఫ్‌పీ) అంచనా ప్రకారం అప్గాన్‌లో 93 శాతం మందికి తినడానికి తగినంత ఆహారం లభించడం లేదు. గత నెలలో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లక ముందు ఇది 80 శాతంగా ఉండేది. పాత అప్గానిస్తాన్‌లో సంపదను కూడబెట్టుకోగలిగిన వ్యక్తులు ఆహారం కొనుక్కునేందుకు నగదు కోసం ఆస్తులను తక్కువ మొత్తానికే అమ్ముకుంటున్నారు. ఎక్కువగా ఆహారం కోసం విక్రయాలు జరగడంతో నగరం అంతటా మార్కెట్లు పుంజుకున్నాయి.

 
విలువైన కార్పెట్‌లు, టీవీల నుంచి కత్తిపీటల వరకు ఇళ్లలోని వస్తువులను ప్రజలు బండ్లపై సెకండ్ హ్యాండ్ మార్కెట్లకు తీసుకురావడం నేను చూశాను. ఒక వ్యక్తి రబ్బరు మొక్కను విక్రయిస్తున్నాడు. చాలామంది అమ్మడానికి వస్తున్నారు. కొద్ది మంది మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నగదు లభ్యత తక్కువగా ఉండటంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్లు కూడా స్తబ్దుగా ఉన్నాయి.

 
ఆకలి తీర్చే బాధ్యత ఆ దేశానిదే..
వ్యక్తిగత స్వేచ్ఛ, బాలికల విద్య, మహిళల పని చేసే హక్కులకు హరించడాన్ని ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండించింది. కానీ, ఆకలి సమస్యను తీర్చే అత్యవసర బాధ్యత మాత్రం ఆ దేశంపైనే ఉంది. అఫ్గాన్లకు సహాయం చేయాలనుకునే దేశాలు, తాలిబాన్లను తిరస్కరించాయి. దీంతో పెద్ద గందరగోళం ఎదురైంది. ప్రజలు పని చేసి డబ్బు సంపాదించడానికి, జీవించడానికి, తినడానికి, తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో ఆచరణీయమైన పాలన కొనసాగించాలి.

 
తాలిబాన్లతో పోరాడిన అమెరికా, బ్రిటన్ సహా ఇతర దేశాలకు, ఈ పాత శత్రువుపై విజయం సాధించినట్లు అనిపించినా, ప్రస్తుత పరిస్థితులను జీర్ణించుకోవడం కష్టమే. ప్రత్యామ్నాయం మరింత దారుణంగా ఉండవచ్చు. ప్రజలు మరిన్ని బాధలకు గురి కావొచ్చు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, శరణార్థులు సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. అఫ్గానిస్తాన్ మరోసారి విఫల దేశంగా మారొచ్చు. ఫలితంగా మళ్లీ అఫ్గాన్‌ గడ్డ జిహాదిస్టులకు అడ్డాగా మారే ప్రమాదం ఉంది.

 
'నేను ఆకలితో ఉంటాను, కానీ, నా పిల్లల ఆకలి చూడలేను'
నగర సమాజంపై 40 ఏళ్ల యుద్ధ మరకలు ఇంకా పోలేదు. అలాగే ఇక్కడ నివసించే కుటుంబాలు వాటిని మర్చిపోలేదు. యుద్ధం వారి కథలన్నింటినీ విరామ చిహ్నాలుగా మార్చింది. ఒక కుటుంబం వీటితో విసిగిపోయింది. వారి ఫ్లాట్ దాదాపు ఖాళీగా ఉంది. వస్తువులను సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో విక్రయించి ఆ డబ్బుతో వారంతా పాకిస్తాన్‌ వెళ్లిపోయారు.

 
ఓ తల్లి విద్యార్థులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాఠాలు బోధిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు అందరూ మగపిల్లలే కాబట్టి తాలిబాన్లు ఆమెను పని చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె చిన్న కుమార్తె చదువును ఆపివేయాల్సి వచ్చింది. ఆమె ధైర్యంగా ఉన్నట్టు కనిపించినా, ఇంటిని విడిచిపెట్టడం ఎంత కష్టమని నేను అడిగినప్పుడు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. "నేను చాలా బాధలో ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్న రోజు నుంచి నా గుండె మండిపోతోంది. కానీ నేను అంతకుమించి ఏం చేయగలను?"

 
"మేం ఇక్కడే ఉన్నా వారు మమ్మల్ని పని చేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతిస్తారని నేను అనుకోను. నేను నా కుటుంబాన్ని ఎలా పోషించగలను? నేను ఆకలితో ఉండడాన్ని తట్టుకోగలుగుతాను. కానీ నా పిల్లలు ఆకలితో అలమటించడాన్ని మాత్రం తట్టుకోలేను". అవినీతి కమ్ముకున్న దేశంలో ఇలాంటి వారి కలలు సాకారమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విదేశీ మద్దతుదారుల నిష్క్రమణను ఆ దేశం తట్టుకుని నిలబడలేకపోయింది. జీవించడానికి కావాల్సిన ప్రాథమిక అంశాలైన ఆహారం, భద్రత, ఆశలతో అఫ్గానిస్తాన్‌లో సరికొత్త సంక్షోభం ముడిపడి ఉంది.