ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (11:46 IST)

మెక్సికో పార్లమెంటులో ‘ఏలియన్స్‌’.. నాసా ఏం చెప్పిందంటే

Alien
మెక్సికో పార్లమెంట్‌లో రెండు రోజుల కిందట కొందరు పరిశోధకులు గ్రహాంతరవాసులు అంటూ రెండు ఆకారాలను ప్రదర్శించారు. అప్పటి నుంచి ఆ ఫొటోలు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా విడుదల చేసిన యూఎఫ్‌ఓ రిపోర్టులో గ్రహాంతరవాసులు(ఏలియన్స్) ఉన్నట్లు ఆధారాలు ఇంతవరకు దొరకలేదని తెలిపింది. వందలాది అన్‌-ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్(యూఎఫ్ఓ)లపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా జరిపిన సుదీర్ఘ పరిశోధనలలో గ్రహాంతరవాసులు(ఏలియన్స్) ఉన్నట్లు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు దొరకలేదని తేలింది.
 
అలా అని గ్రహాంతర జీవులు లేవని కొట్టిపారేయలేమని.. ఆధారాలు మాత్రం ఇంతవరకు దొరకలేదని చెప్పింది. ఎంతోమంది చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ రిపోర్ట్ కూడా గ్రహాంతరవాసులకు సంబంధించి కొత్త సమాచారం కానీ, ఆధారాలు కానీ ఇవ్వలేదు. కానీ, అన్‌ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా(యూఏపీ)లకు సంబంధించి నాసా ముందుముందు అధునాతన సాంకేతికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిశోధనలు ఎలా కొనసాగించనుందనేది ఈ నివేదికలో వెల్లడించింది. యూఏపీ‌ల అధ్యయనానికి సంబంధించి మరింత పారదర్శకతతో డేటాను అందించనున్నామని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ అన్నారు. 36 పేజీల ఈ నివేదికలో సాంకేతిక, శాస్త్రీయ పరిశీలనలు ఉన్నాయి.
 
‘ఆధారాలు మాత్రమే లేవు.. గ్రహాంతరవాసులు ఉండొచ్చు’
యూఏపీలు కనిపించాయన్న వందలాది సంఘటనలకు సంబంధించి నాసా పరిశోధించింది. అయితే, యూఏపీలు కనిపించడానికి కారణం గ్రహాంతరవాసులు అనడానికి ఎలాంటి నిర్దిష్టమైన ఆధారాలు దొరకలేదు అని ఈ రిపోర్ట్ చివరి పేజీలో చెప్పారు. సౌర వ్యవస్థలో ప్రయాణిస్తూ ఇలాంటి వస్తువులు భూమిపై ఉన్నవారికి కనిపించి ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఈ నివేదికలో స్పష్టత ఇవ్వనప్పటికీ ‘భూవాతావరణంలో గుర్తు తెలియని ఏలియన్ టెక్నాలజీ’ ఏదైనా ఆపరేట్ అయ్యే అవకాశాలను మాత్రం నాసా తోసిపుచ్చలేదు.
 
భూగ్రహంపై అత్యంత రహస్యాలలో యూఏపీలు కూడా ఒకటి. వీటికి సంబంధించి హై క్వాలిటీ డేటా లేకపోవడమే ఈ రహస్యానికి కారణం అని నాసా సైన్స్ మిషన్ డైరెక్టరేట్‌లో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ నికోలా ఫాక్స్ చెప్పారు. యూఏపీలు కనిపించాయని అంటున్నా ఆ విషయంలో శాస్త్రీయమైన ముగింపు ఇచ్చేందుకు వీలుగా వాటి మూలాలు, స్వభావానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదని నికోలా చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి డేటాను పరిశీలించేందుకు, ఒక విస్తృతమైన డేటాబేస్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యూఏపీ రీసెర్చ్‌కు కొత్త డైరెక్టర్‌ను నాసా నియమించినట్లు నికోలా ప్రకటించారు. డేటా సేకరణ, పరిశీలన ప్రక్రియలో ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ టూల్స్‌ను కొత్త డైరెక్టర్ వాడనున్నారు.
 
మెక్సికో పార్లమెంట్‌లో ప్రదర్శించిన ఆకారాలు ఏమిటి? ఏలియన్సేనా
అయితే, ఈ వారం ప్రారంభంలో మెక్సికన్ అధికారులు గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా చెప్తూ రెండు మానవేతర ఆకారాలను ప్రదర్శించారు. దీనిపై నాసా ప్యానల్‌‌తో బీబీసీ రిపోర్టర్ సామ్ కాబ్రాల్ మాట్లాడారు. తనకు తాను యూఎఫ్ఓ నిపుణుడిగా చెప్పుకునే జైమ్ మౌసాన్.. గ్రహాంతరవాసులవిగా పేర్కొంటూ రెండు ఆకారాలను మెక్సికో పార్లమెంట్‌లో చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. పార్లమెంట్‌లో వీటిని ప్రదర్శించిన తర్వాత, ఈ మానవేతర ఆకారాల గురించి జైమ్ మౌసాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మెక్సికో జర్నలిస్ట్‌లకు వివరించారు.
 
వీటిని 2017లో పెరూలోని కుస్కోలో గుర్తించినట్లు చెప్పారు. రేడియోకార్బన్ టెస్ట్ చేయగా ఆ రెండు 1,800 ఏళ్ల కిందటివని తేలిందన్నారు. అయితే, ఆ ఆకారాల విశ్వసనీయతపై సైంటిఫిక్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ శాస్త్రీయ సమాజానికి ఈ శాంపిళ్లను ఇవ్వాలని, అప్పుడు వాటిలో ఏముందో తాము పరిశీలిస్తామని నాసా పరిశోధకులు డాక్టర్ డేవిడ్ స్పెర్గెల్ అన్నారు.
 
కొత్త యూఎఫ్ఓ బాస్ గుర్తింపు కూడా రహస్యమే
యూఏపీ రీసెర్చ్‌కు కొత్త నాసా డైరెక్టర్ వచ్చారు. కానీ, ఆ డైరెక్టర్ వివరాలు రహస్యంగా ఉంచారు. తన యూఏపీ పరిశోధనలలో పారదర్శకతకు నాసా కట్టుబడి ఉన్నందున్న.. గురువారం నిర్వహించిన సమావేశంలో కూడా కొత్త బాస్ పాత్ర ఏంటి, ఆ డెరెక్టర్‌కి ఎంత చెల్లిస్తున్నారనే విషయాలనూ రహస్యంగా ఉంచారు. అంతేకాక, కొత్త డైరెక్టర్‌కు ప్రమాదం పొంచి ఉందనే కారణంతో వారి గుర్తింపును బయటికి వెల్లడించలేదన్నది మరో కారణం. యూఏపీ రీసెర్చ్ ప్యానల్ సభ్యులకు బెదిరింపులు వస్తున్నట్లు నాసా రీసెర్చ్‌కు అసిస్టెంట్ డిప్యూటీ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌ అయిన డాక్టర్ డేనియల్ ఇవాన్స్ చెప్పారు. యూఏపీ రీసెర్చ్ ప్యానల్ సభ్యుల భద్రతను నాసా చాలా సీరియస్‌గా తీసుకుందని.. బెదిరింపుల నేపథ్యంలోనే యూఏపీ రీసెర్చ్ డైరెక్టర్ పేరును వెల్లడించలేదని తెలిపారు.
 
ఏఐ టూల్స్ వాడాలని నాసా ప్రతిపాదన
యూఏపీలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేవి అత్యంత అవసరమైన ఉపకరణాలుగా నిలిచాయని రిపోర్టు తెలిపింది. యూఏపీలను గుర్తించేందుకు, వాటిని మెరుగ్గా అర్థం చేసుకునేందుకు అవసరమైన డేటా తమ వద్ద లేకపోవడమే అతిపెద్ద సవాల్ అని నాసా తెలిపింది. క్రౌడ్‌సోర్సింగ్ టెక్నిక్స్ ద్వారా ఈ అంతరాన్ని భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. పౌరుల యూఏపీ రిపోర్టులను సేకరించి, నిర్వహించేందుకు ఎలాంటి ప్రామాణిక వ్యవస్థ లేదని రిపోర్టు తెలిపింది. ఫలితంగా డేటా అసంపూర్ణంగా ఉన్నట్లు పేర్కొంది.