గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (11:36 IST)

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: విద్యార్థులతో సూర్య నమస్కారాలను ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు వ్యతిరేకిస్తోంది?

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా పాఠశాలల్లో సూర్యనమస్కారాలను నిర్వహించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. జనవరి 1 నుంచి 7 వరకు విద్యార్థులతో 'సూర్య నమస్కారం' కార్యక్రమాన్ని నిర్వహించాలని దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

 
అయితే, 'సూర్య నమస్కార్' కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులను ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. సూర్య నమస్కారం అనేది సూర్యుని ఆరాధనకు సంబంధించినది కాబట్టి, ముస్లిం విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని సూచించింది. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఓ ప్రకటన విడుదల చేశారు.

 
ప్రకటనలో ఏముంది?
"భారతదేశం లౌకిక, బహు-మత, బహు-సంస్కృతుల దేశం. ఈ సూత్రాల ఆధారంగా మన రాజ్యాంగాన్ని రాశారు. ఒక మతానికి సంబంధించిన సూత్రాలను, విధానాలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధించడాన్ని, లేదా ఒక నిర్దిష్ట వర్గం వారి విశ్వాసాల ఆధారంగా వేడుకలు నిర్వహించడాన్ని రాజ్యాంగం అనుమతించదు'' అని బోర్డు తన ప్రకటనలోపేర్కొంది. ‘‘కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ వాస్తవాలను విస్మరించడం చాలా దురదృష్టకరం. సమాజంలోని అన్ని వర్గాలపై మెజారిటీ వర్గం ఆలోచనలు, సంప్రదాయాలను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు'' అని బోర్డు ఆరోపించింది.

 
''75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 30 రాష్ట్రాల్లో సూర్య నమస్కార్ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో మొదటి దశలో 30 వేల పాఠశాలలు కవర్ చేస్తారు. జనవరి 1, 2022 నుండి జనవరి 7, 2022 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జనవరి 26న సూర్య నమస్కారం పై ఒక ప్రదర్శనకూ ప్రణాళికలు సిద్ధం చేశారు'' అని బోర్డు వెల్లడించింది.

 
'దేశ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలి'
''ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. దేశభక్తి పేరుతో సాగుతున్న తప్పుడు ప్రచారం. సూర్య నమస్కారం సూర్యారాధనకు ఒక రూపం. ఇస్లాంతోపాటు, దేశంలోని ఇతర మైనారిటీలు సూర్యుడిని దేవతగా పరిగణించరు. అలాంటి ఆరాధన సరైనదని అందరికీ బోధించవద్దు. ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకుని దేశంలోని లౌకిక విలువలను గౌరవించాలి'' అని బోర్డు కోరింది. ''దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గింపు, విద్వేష ప్రసంగాల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలి. ప్రజల నిజమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి'' అని పేర్కొంది.

 
సూర్య నమస్కారంపై వివాదం
ఇటీవల కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలలో 'సూర్య నమస్కార్' నిర్వహించాలంటూ ఒక సర్క్యులర్ జారీ చేసిందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక వెల్లడించింది. ఇది ప్రభుత్వం చేపట్టిన కాషాయీకరణ విధానంలో భాగమని పలు సంస్థలు ఆరోపించాయి. డిసెంబర్ 12న విడుదల చేసిన ఈ సర్క్యులర్‌లో పాఠశాలలు ఉదయం ప్రార్ధన సమయంలో 'సూర్య నమస్కారం' నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎక్కువగా పాల్గొనేలా చూడాలని కోరింది. మొదట్లో ఈ ఉత్తర్వులు కాలేజీల కోసం పంపినా, తర్వాత వీటిని స్కూళ్లలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

 
జనవరి 26న జరగనున్న సామూహిక సూర్య నమస్కార కార్యక్రమం కోసం ఇది ఒక సన్నాహకమని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్య నమస్కారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ కార్యక్రమంలో ఏడున్నర లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కర్ణాటకలో కూడా చాలామంది ఈ కార్యక్రమంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

 
సోషల్ మీడియాలో రియాక్షన్లు
ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటన వెలువడిన తర్వాత సోషల్ మీడియాలో సూర్య నమస్కారం గురించి చర్చ మొదలైంది. ఈ విషయంపై చాలామంది స్పందిస్తున్నారు. "సూర్య నమస్కారం ద్వారా వ్యాయామం, యోగా, ప్రాణాయామంలాంటి ప్రయోజనాలు కూడా కలిసి లభిస్తాయి. అలాంటి సాధనాన్ని వ్యతిరేకించేవాళ్లు, అడ్డుకునేవారిపై ఆ భగవంతుడు ఆగ్రహిస్తాడు. తెలివిగలవారు ఎవరూ ఇలాంటి పని చేయరు'' అని స్వామి గోవింద దేవ్ గిరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సూర్య నమస్కారాన్ని వ్యతిరేకించడం ద్వారా కొంతమంది ఉలేమాలు భారతీయ ముస్లింల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా ఇస్లాం ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ట్వీట్ చేశారు.

 
సూర్య నమస్కారంలో ఏముంటుంది?
సూర్య నమస్కార్ అనేది శారీరక వ్యాయామానికి సంబంధించిన యోగ భంగిమ. యోగా గురువులు చెప్పినదాని ప్రకారం, సూర్య నమస్కారంలో 12 యోగా భంగిమలు ఉన్నాయి. ప్రతి భంగిమకు తనదైన ప్రాముఖ్యం ఉంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని యోగా నిపుణులు పేర్కొంటున్నారు. పొట్టను తగ్గించడంలో, శరీరాన్ని చురుకుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది సూర్యుడి ప్రార్ధన అని చాలామంది అంటుంటారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

 
''ఇది కొంత వరకు మతంతో ముడిపడి ఉంది. కానీ, దానిని చూసే దృక్కోణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మనం మోకాళ్ల మీద కూర్చున్నప్పుడు కొందరు దాన్ని ప్రార్ధన అనవచ్చు. కొందరు అది కేవలం కూర్చోవడం అని కూడా అనుకోవచ్చు'' అని 'యోగా లండన్' సహ-వ్యవస్థాపకురాలు రెబెక్కా ఫ్రెంచ్ అభిప్రాయపడ్డారు.