బిల్‌ గేట్స్‌, మెలిండా గేట్స్‌: 27ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకుని, విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన

bill gates - milinda gates
బిబిసి| Last Modified మంగళవారం, 4 మే 2021 (12:10 IST)
27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత బిల్ గేట్స్, మెలిండా గేట్స్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. "ఒక జంటగా మేం ముందుకు వెళ్లగలమని మాకు అనిపించడం లేదు" అని తాము జారీ చేసిన ఒక ప్రకటనలో ఇద్దరూ చెప్పారు. తమ విడాకుల గురించి ఇద్దరూ ట్విటర్ ద్వారా ఒక ప్రకటన జారీ చేశారు. అందులో "మా బంధం గురించి, చాలా లోతుగా ఆలోచించుకున్న తర్వాతే మేం విడాకులు తీసుకోవాలని నిర్ణయిచుంకున్నాం" అని చెప్పారు.

"గత 27 ఏళ్లుగా మేం ముగ్గురు పిల్లల్ని పెంచి పోషించాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన జీవితాన్ని అందించే ఒక అద్భుతమైన సంస్థను స్థాపించాం. ఈ మిషన్‌ మీద మేం కచ్చితంగా మా నమ్మకం ఉంచుతాం. ఇక ముందు కూడా ఫౌండేషన్ కోసం పనిచేస్తూనే ఉంటాం. కానీ, మా జీవితం తర్వాత దశలోకి ఒక జంటగా మేం ముందుకు వెళ్లలేమని మాకు అనిపించింది" అన్నారు.


మెలిండా 1980వ దశకంలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయినప్పుడు బిల్ గేట్స్ తొలిసారి ఆమెను కలిశారు. వీరిద్దరూ కలిసి 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌' అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధులకు చికిత్స, చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై ఈ సంస్థ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. 'గివింగ్ ప్లెడ్జ్' ప్రారంభించడం వెనుక ఎక్కువగా బిల్-మెలిండా, బిలియనీర్ వారెన్ బఫెట్ చొరవ ఉంది.

'గివింగ్ ప్లెడ్జ్' అంటే ఒక బిలియనీర్ తనకుతానుగా తన సంపదలో ఒక పెద్ద భాగాన్ని సామాజిక అభ్యున్నతి కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించడం. ఫోర్బ్స్ మ్యాగజీన్ వివరాల ప్రకారం 124 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో బిల్ గేట్స్ ప్రపంచ సంపన్నుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. 1970వ దశకంలో బిల్ గేట్స్ ప్రముఖ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ స్థాపించారు. ఈ కంపెనీ బిల్ గేట్స్‌కు పేరు, సంపద తెచ్చిపెట్టింది.

దీనిపై మరింత చదవండి :