కోవిడ్ మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బతిన్న అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో భారత్ రెండో స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కానీ, అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక తెలిపింది.
ఇంతకీ భారత్ స్థానం ఒకటా, రెండా ? ఆ స్థితికి ఎందుకు దిగజారింది?
కరోనా మహమ్మారి, దానివల్ల విధించిన లాక్ డౌనే ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు. కోవిడ్ వైరస్ భారత ఆర్ధిక వ్యవస్థను కుదిపేసింది. అయితే కేవలం కోవిడ్ మహమ్మారినే పూర్తి బాధ్యురాలిని చేయవచ్చా... అంటే కాదని చెప్పవచ్చు. కరోనాకు ముందే భారత ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉంది. జీడీపీ 11 సంవత్సరాల కనిష్టానికి చేరుకుంది. 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో భారత జీడీపీ 4.2శాతానికి పడిపోయింది.
2018 మార్చినాటికి జీడీపీ 8.2 శాతంగా ఉంది. అదే 2020 మార్చి వచ్చేసరికి 3.1కు పడిపోయింది. గత ఎనిమిది త్రైమాసికాలుగా జీడీపీ పడిపోతూనే ఉంది. 2017-18లో భారతదేశ నిరుద్యోగిత శాతం గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయి 6.1శాతానికి చేరుకుంది.
భారతదేశపు ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉందన్న విషయం ఒప్పుకోక తప్పదు. కరోనా మహమ్మారికి ముందు మూడేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని ఆర్ధిక చర్యలు దీర్ఘకాలంలో ప్రయోజనకరమే అయినా ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపాయి. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం కూడా దీనిపై పడింది అని ఐఐఎం కలకత్తాలో ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పని చేస్తున్న పార్థారాయ్ బీబీసీ అన్నారు.
ఎందుకిలా జరిగింది?
ప్రభుత్వం హఠాత్తుగా చేపట్టిన ఆర్ధిక సంస్కరణలే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ, రియల్ ఎస్టేట్ రంగంలో తెచ్చిన రెరా చట్టంవంటివి వివిధ రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపాయి.
ప్రభుత్వం వరసగా తీసుకున్న విధాన నిర్ణయాలు ఉత్పాదకత మీదనే కాకుండా, జీవనాధారం మీద కూడా ప్రభావం చూపాయి. జీఎస్టీ కొన్ని రంగాలపై నెగెటివ్ ఎఫెక్ట్ ను చూపింది. పడిపోయిన ఉత్పాదకతను తిరిగి సాధించడానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫలించలేదు. దీని ప్రభావం ఉపాధి అవకాశాల మీద పడింది అని ఇండియన్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లో ప్రినిపల్ ఎకనమిస్ట్ గా పని చేస్తున్న సునిల్ కుమార్ సిన్హా బీబీసీతో అన్నారు.
పట్టణ వినియోగదారుల ఆదాయం అనుకున్నంతగా పెరగలేదు. దీంతో పరిస్థితి తిరోగమనంవైపు మళ్లింది. గ్రామీణ వినియోగశక్తి పట్టణాల వినియోగశక్తి భర్తీ చేయలేకపోయింది. ఆర్ధికవ్యవస్థలో వ్యవసాయం వాటా కేవలం 15-16శాతమే అన్నారు సిన్హా. ఉత్పాదకత పూర్తిస్థాయిలో ఊపందుకోకపోవడంతో పట్టణ ఆర్ధిక రంగం అంతగా కోలుకోలేక పోయింది. పట్టణాలు, గ్రామాలలో డిమాండ్ పెంచగలిగేవారు పిరమిడ్ లో కింద ఉండిపోయారు. గత బడ్జెట్ లలో ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్థ పిరమిడ్ లో కింద ఉన్న వారిపై దృష్టి పెట్టేవి.
ఇప్పుడైనా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లు ఇవ్వదలుచుకుంటే కింది స్థాయి వారికి ఇవ్వొచ్చు. కానీ ఉపాధి కల్పిస్తాయన్న ఆశతో కార్పొరేట్ రంగానికి ఎక్కువ మినహాయింపులు ఇచ్చింది. కార్పొరేట్లు వాటి లోట్లను పూడ్చుకోవడానికి దానిని వాడుకున్నాయి అని సిన్హా అన్నారు. బ్యాంకింగ్, టెలీకాం వంటి కొన్ని రంగాలకు కరోనా ప్రభావం లేదు. ఎందుకంటే అవి 2019నాటికే సమస్యల్లో ఉన్నాయి. కరోనా వాటి సమస్యలను మరింత పెంచింది అని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ లో గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్ గా పని చేస్తున్న అరుణ్ సింగ్ వ్యాఖ్యానించారు.
అప్పటికే ఆర్ధిక సమస్యల్లో ఉన్నవారు కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల కోతలులాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. ఖర్చు విషయంలో వారు మరింత జాగ్రత్తపడ్డారు. పరిస్థితి ఇంకా కుదుటపడలేదని చాలామంది భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80-90% మందికి వ్యాక్సీన్ అందే వరకు ప్రజలు ఇలా పొదుపు నియమాలు పాటిస్తూనే ఉంటారు. కొందరు ఉద్యోగాలు కోల్పోగా, మరికొందరికి బోనస్ లు తగ్గిపోయాయి. 2021లో ఇంక్రిమెంట్లు ఉండవని కూడా వారికి అర్ధమైంది అన్నారు అరుణ్ సింగ్.
ప్రభుత్వం ఏం చేసింది?
ప్రజల వినియోగాన్ని పెంచడానికి కేంద్రం ప్రభుత్వం 2020 అక్టోబర్‌లో రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగకు అడ్వాన్స్ ఇవ్వడం. ఇక రెండోది లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) ప్రకటించడం. మార్చి 31, 2021 నాటికి వరకు చెల్లుబాటు అయ్యేలా సుమారు పదివేల రూపాయలకు విలువైన క్యాష్ వోచర్లు కేంద్రం ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు వీలుగా 50 సంవత్సరాల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చింది. వీటన్నింటి విలువ 73,000 కోట్లు. మరో 8000 కోట్ల రూపాయలను కూడా ప్రజలకు చేర్చే యోచనలో ఉంది ప్రభుత్వం.
ఇంకా చేయాల్సింది ఏంటి?
తయారీ రంగం కొంత వరకు కోలుకుందని, సర్వీస్ సెక్టార్ కు ప్రభుత్వ చేయూత ఇంకా వేగంగా అందించాల్సిన అవసరం ఉందని క్రిసిల్ లో చీఫ్ ఎకనామిస్ట్ గా పని చేస్తున్న డీకే జోషీలాంటి నిపుణులు సూచిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలోని మధ్య, దిగువ తరగతి వర్గాలకు చేయూత అందించాల్సిన అవసరం ఉంది. క్యాష్ ట్రాన్స్ ఫర్ లాంటి పథకాలను వారికి కల్పించాలి అన్నారు జోషీ.
ప్రభుత్వం ద్రవ్యలోటును అదుపు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ధనం వెచ్చించాలని ఆర్ధికవేత్తలు సూచిస్తున్నారు. ప్రజల చేతుల్లోకి డబ్బు చేరేలా చూస్తే డిమాండ్ పెరుగుతుందని, అది ఆర్ధిక వ్యవస్థకు మేలు చేస్తుందని వారు అంటున్నారు.