కాగ్: ఆంధ్రప్రదేశ్ వచ్చే ఏడేళ్లలో చెల్లించాల్సిన అప్పు రూ. 1,10,010 కోట్లు - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక తూర్పారబట్టిందని 'ఈనాడు' కథనం రాసింది. శాసనసభ నియంత్రణ దాటిపోయే స్థాయిలో ఆర్థిక వ్యవహారాలు ఉంటున్నాయని కాగ్ ఆగ్రహించింది. శాసనసభ ఆమోదం పొందకుండానే అనుబంధ పద్దు మొత్తాలు ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. అసలు ఇది రాజ్యాంగ నిబంధనలకే విరుద్ధమని హెచ్చరించింది.
అప్పుల తీరుతెన్నులను బడ్జెట్‌లో చూపకుండా అప్పు చేసి తెచ్చిన నిధులను ఖర్చుచేస్తున్న వ్యవహారాలను తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది.
ఒకవైపు సగటున 6.31% వడ్డీతో అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రప్రభుత్వం వివిధ కంపెనీలు, కార్పొరేషన్లలో రూ.కోట్ల పెట్టుబడులు పెడుతూ కనీసం 0.04% ప్రతిఫలం కూడా పొందట్లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు తీర్చేందుకు ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించే వనరులు మరింత తగ్గిపోతాయని చెప్పింది. 2020 మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ పూర్తయిన పద్దుల ఆధారంగా కాగ్ ఈ విశ్లేషణ చేసింది. ఒక నివేదికను వెలువరించింది. ఆ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభకు సమర్పించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
'ఒకవైపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల శాతం పెరిగిపోతోంది. ఏటా ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఆదాయంలో వడ్డీకి చెల్లించాల్సిన వాటాయే అధికం. గడిచిన అయిదేళ్లలో కొత్తగా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులో 65-81% పాత అప్పు తీర్చేందుకే వినియోగించాల్సి వస్తోంది. అప్పు తీసుకుంటే దాంతో ఆస్తులు సృష్టించాలి. అంటే ప్రభుత్వానికి ఆదాయం అందించే అభివృద్ధి కార్యక్రమాలపై వెచ్చించాలి.
రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు, రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఈ రుణాలు చెల్లించేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అభివృద్ధి పనులకు నిధులు ఉండబోవు' అని కాగ్ సుస్పష్టంగా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాబోయే ఏడేళ్లలోనే రూ.1,10,010 కోట్ల అప్పులను ప్రభుత్వం తీర్చాల్సి ఉంటుందని 2020 మార్చి నెలాఖరు వరకు ఉన్న లెక్కల ప్రకారం కాగ్ పేర్కొంద''ని ఆ కథనంలో రాశారు.