శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (20:51 IST)

అమితాబ్ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు?

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 2019 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. 


‘‘రెండు తరాలుగా తన సినిమాలతో ఎందరినో అలరించిన, స్ఫూర్తిని నింపిన గొప్ప నటుడు అమితాబ్ బచ్చన్‌ ఈ సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీంతో భారత దేశంతో పాటు అంతర్జాతీయ సినీ అభిమానులు కూడా సంతోషిస్తారు. ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రకాశ్ జవడేకర్ ట్వీట్ చేశారు. గత సంవత్సరం ఈ అవార్డు బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాను వరించింది.

 
ఎవరీ దాదాసాహెబ్ ఫాల్కే
దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత దేశంలో 1870 ఏప్రిల్ 30న టింబక్ అనే ఊరిలో ఫాల్కే జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. ఫాల్కేను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనత ఫాల్కేదే.

 
సృజనాత్మక కళలవైపు చిన్నతనం నుంచే ఫాల్కేకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన కలలను నెరవేర్చుకునే లక్ష్యంతో 1885లో బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ ఆయన ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్‌, డ్రామాలు వేయడం వంటి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. అంతేకాదు, ఇంద్రజాల విద్యలను కూడా అభ్యసించారు.

 
కొద్దికాలం పాటు ఓ పెయింటర్‌గా, సినిమా సెట్లకు డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మకు చెందిన ప్రెస్‌లో పనిచేస్తుండగా వర్మ గీసిన హిందూ దేవతల చిత్రాలను చూసిన ఫాల్కే వాటినుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు. 1908లో మరొక వ్యక్తితో కలసి 'ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్' అనే పేరుతో ఓ వ్యాపారాన్ని ప్రారంభించినా, ఇద్దరి మధ్యా విభేదాల కారణంగా అది రాణించలేదు.

 
ఆ తర్వాత ఓసారి 1910లో మూకీ చిత్రం 'ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్'ను చూడడం ఫాల్కే జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా సినిమా నిర్మాణాన్ని భారత్‌కు తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దీంతో 1912లో సినిమాలకు సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు లండన్ వెళ్లారు. ఆ తర్వాత 1913లో భారత తొలి మూకీ సినిమా 'రాజా హరిశ్చంద్ర'ను విడుదల చేశారు. ఈ చిత్రానికి మాటలు, నిర్మాణం, దర్శకత్వం, పంపిణీ బాధ్యతలన్నీ ఫాల్కేనే నిర్వహించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది.

 
సినిమాల్లో మహిళలు నటించడం అనేది ఆ రోజుల్లో ఊహించలేని విషయం. కానీ ఆయన 1913లో తన తదుపరి సినిమా 'భస్మాసుర్ మోహిని'లో ఓ మహిళను ప్రధాన పాత్రలో నటింపజేశారు. 1917లో హిందుస్తాన్ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. ఆ సంస్థ నుంచి ఎన్నో సినిమాలు నిర్మించారు. లంకా దహన్ (1917), శ్రీ కృష్ణ జన్మ (1918), సైరంధ్రి (1920), శకుంతల (1920) వంటి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలను నిర్మించారు. సినిమాలకు శబ్దం తోడైన తర్వాత ఫాల్కే సేవలు మరుగునపడిపోయాయి. దీంతో ఆయన 1930లో సినిమాలు నిర్మించడాన్ని మానేశారు. ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో మరణించారు.

ఈ అవార్డు ఎందుకిస్తారు
భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుమీద ఓ అవార్డుని ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969లో ప్రకటించారు. ఈ అవార్డును కూడా భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా అందిస్తారు. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు అందజేస్తారు. తెలుగు సినీరంగం నుంచి గతంలో కె.విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు.