గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2023 (19:12 IST)

'డెవిల్ ట్రీస్': విశాఖలో ఈ 'ఏడాకుల చెట్ల'ను చూసి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు?

Devil Tree
విశాఖ వీధుల్లో ఇరువైపులా, రహదారుల మధ్యలో పచ్చదనం కోసం పెంచిన చెట్లను చూసి ప్రజలు భయపడుతున్నారు. ఈ చెట్లను తొలగించాలంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ చెట్లను దెయ్యం చెట్లు, డెవిల్ ట్రీస్ అనే పేర్లతో పిలుస్తున్నారు. ఈ డెవిల్ ట్రీ విశాఖకు ఎక్కడ నుంచి వచ్చింది? నగరమంతా ఈ చెట్లను కార్పోరేషన్ ఎందుకు పెంచింది? ఎత్తుగా, ఏపుగా పెరిగిన ఈ చెట్లను ప్రజలు ఎందుకు తొలగించమంటున్నారు? నగర వాసులను భయపెడుతున్న ఈ చెట్ల గురించి వృక్షశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు?
 
ఈ చెట్ల వల్ల ఇబ్బంది ఏమిటి?
నీటి వనరులతో సంబంధం లేకుండా ఏడాది పొడువునా ఈ చెట్టు పచ్చగా కనిపిస్తుంటుంది. శీతాకాలం సీజన్‌లోనూ నిండా పువ్వులతో కనిపిస్తుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ పువ్వులు మూడు, నాలుగు దశల్లో పుస్తాయి. ఆ సమయంలో వీటి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన వాసన వస్తుంది. ఈ వాసనను తట్టుకోలేకపోతున్నామని నగర వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయంటూ చెప్తున్నారు.
 
విశాఖ పోర్టు రిటైర్డ్ ఉద్యోగి వాసుదేవరావు ఇంటి ముందు ఈ చెట్టు ఉంది. ఆ చెట్టు రెండతస్తుల భవనం అంత ఎత్తు ఎదిగింది. ఈ చెట్టు నుంచి వచ్చే వాసనతో ఊపిరి ఆడనట్లు అయిపోతుందని వాసుదేవరావు చెప్పారు. “శీతాకాలమంతా ఈ చెట్టు నుంచి వచ్చే గాలితో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. నాకు గుండె ఆపరేషన్ కూడా అయింది. మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ చెట్లు తొలగించాలని జీవీఎంసీకి ఫిర్యాదు చేశాను. కానీ వారు తొలగించడం లేదు” అని బీబీసీతో ఆయన చెప్పారు.
 
ఈ చెట్లు చిన్నవిగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ గత రెండేళ్లుగా వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని టీవీ మెకానిక్ శ్రీనివాసరావు అన్నారు. ‘‘పూత వచ్చీ, మళ్లీ ఆ పూత పోయే వరకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ చలికాలంలో మూడు, నాలుగు సార్లు పూతరావడం, పోవడం జరుగుతోంది. జీవీఎంసీకి ఫిర్యాదు చేసినా వీటిని తొలగించడం లేదు. మేమే తీసేద్దామంటే... పెద్ద చెట్లు కావడంతో సాధ్యం కావడం లేదు’’ అని ఆయన చెప్పారు.
 
నగరానికి ఈ చెట్టు ఎలా వచ్చింది?
2014లో హుద్ హుద్ తుపాను విశాఖ నగరంలో విధ్వంసం సృష్టించింది. ఆ విధ్వంసానికి నగరంలోని పచ్చదనం 70 నుంచి 80 శాతం మాయమైపోయింది. తిరిగి మళ్లీ నగరంలో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు ప్రభుత్వం వివిధ రకాలైన మొక్కలను తెచ్చి పెంచడం ప్రారంభించింది. అలా వచ్చిందే ఈ డెవిల్ ట్రీ. అటవీ శాఖ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నగరమంతా ఆ మొక్కలను నాటారు. నేటికి ఏడేళ్లు దాటడంతో... ప్రస్తుతం అవి పెద్ద చెట్లుగా ఎదిగాయి. ఈ చెట్లకు అక్టోబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో భారీగా పూత రావడంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు చెప్తున్నారు. నిత్యం వాసన పీల్చడంతో వికారం, తలనొప్పి, శ్వాస ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు.
 
“డెవిల్ ట్రీ అంటున్న ఈ చెట్ల శాస్త్రీయ నామం ఆల్‌స్టోనీయా స్కోలరీస్. ఇవి అతి తక్కువ సమయంలో ఏపుగా పెరుగుతూ నిత్యం పచ్చగా ఉంటాయి. భూమి నుంచి తక్కువ నీటిని తీసుకుంటాయి. త్వరితగతిన పచ్చదనం నింపేందుకు నగరమంతా దాదాపుగా ఐదారు లక్షలకు పైగా మొక్కలను నాటారు. వీటిని సప్తవర్ణి లేదా ఏడాకుల చెట్లు అని కూడా పిలుస్తారు. ఒక చోట గుత్తిగా ఏడాకులు ఉండటంతో ఈ చెట్లను ఏడాకుల చెట్లు అని పిలుస్తారు” అని ఏయూ వృక్షశాస్త్ర విభాగం తెలిపింది. ‘‘చలికాలంలో ఈ చెట్ల నుంచి విపరీతమైన ఘాటు వాసనలు వస్తుంటాయి. ఈ చెట్ల పూల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోయి శ్వాసకు స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కానీ ఈ చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే ఈ చెట్లను తొలగించమనడం మంచిది కాదు’’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఈ చెట్టు మంచిదా, చెడ్డదా?
నగరంలోని చాలా చోట్ల ఉన్న ఈ ఏడాకుల చెట్లను తొలగించమని ప్రజలు, వీటితో అంత ఇబ్బందులు ఉండవని వృక్ష శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి ఈ చెట్లను ఉంచాలా, తీసేయాలా లేదంటే మరేదైనా మార్గం ఉందా? అనే విషయంపై తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ, ఏపీలోని ఆంధ్ర యూనివర్సిటీ వృక్షశాస్త్ర నిపుణులతో బీబీసీ మాట్లాడింది. ఈ చెట్లపై ఏయూ వృక్షశాస్త్ర విభాగం పోస్ట్ డాక్టర్ ఫెలోగా పని చేస్తున్న వారు పరిశోధనలు కూడా చేశారు. వారిలో డాక్టర్ కె. వెంకటరమణ ఒకరు.
 
“ఈ చెట్టు మన దేశంలో సహజంగా, వేగంగా పెరుగుతుంది. నీరు పెద్దగా అవసరం ఉండదు. ఈ చెట్టుకు పర్యవేక్షణ, సంరక్షణ చర్యలు కూడా అవసరం ఉండవు. దాంతో పచ్చదనం, సుందరీకరణ కోసం నగరాలకు, పట్టణాలకు ఈ మొక్కను తీసుకుని వచ్చారు. హుద్ హుద్ తర్వాతే అలానే విశాఖకు వచ్చింది ఈ ఏడాకుల చెట్టు. అయితే ఇలాంటి చెట్లను జాతీయ రహదారులు, జనావాసాలు ఎక్కువగా లేని చోట్ల వేస్తే మంచింది. ఎందుకంటే దీని నుంచి వచ్చే ఘాటైన వాసనతో కొందరు ముఖ్యంగా అప్పటికే అనారోగ్య సమస్యలతో ఉన్న వారు ఇబ్బందులు పడతారు” అపి డాక్టర్ కె. వెంకటరమణ బీబీసీతో చెప్పారు.
 
మరి ఘాటైన వాసనలను ఇచ్చే చెట్టును మన ఇళ్ల ముందు లేదా రోడ్డుకు ఇరువైపులా ఉంచడం వల్ల వస్తున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొవాలనే ప్రశ్నకు డాక్టర్ కె. వెంకట రమణ సమాధానం చెప్పారు. “ఈ చెట్లను ఒకే చోట వందలు కొద్దీ నాటుతారు. వీటికి గుత్తులు గుత్తులుగా వచ్చిన పువ్వులు ఒకేసారి ఓపెన్ అవుతాయి. దీనినే మాసివ్ బ్లూమింగ్ అంటారు. ప్రతి ప్లవర్ నుంచి ఆస్మోఫోర్మ్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. ఇవే ఆ వాసనకు కారణం. ఆ పువ్వులను మొగ్గ దశలోనే కత్తిరిస్తే ఈ సమస్య ఉండదు. అప్పుడు ఈ చెట్టు నుంచి వాసనలూ రావు. ఇది శీతాకాల సమయంలో చేస్తే సరిపోతుంది” అని డాక్టర్ కె. వెంకటరమణ చెప్పారు.
 
ఈ చెట్టుతో ఉపయోగాలు ఇవి...
ఏడాకుల చెట్టు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం డాక్టర్ ఈ. నర్సింహమూర్తి చెప్పారు. ఏడాకుల చెట్టు ఘాటైన వాసనలు ఇస్తుండటంతో దీనిని డెవిల్ ట్రీ అని పిలుస్తుంటారని, కానీ నిజానికి ఈ చెట్టుతో అనేక ఉపయోగాలున్నాయని ఆయన తెలిపారు. “ఈ చెట్టు ఆకు దలసరి(థిక్)గా ఉంటుంది. వాహనాల నుంచి వచ్చే శబ్ద కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. ఏడాది పొడవునా ఈ చెట్టు ఆకుపచ్చగా ఉంటుంది. దాంతో ఎక్కువ ఆక్సిజన్ కూడా ఇస్తుంది. మిగతా చెట్లతో పోలీస్తే ఎండకాలంలో ఎక్కువ నీడను ఇస్తుంది. వీటిపై పక్షులు గూళ్లు పెట్టుకుంటాయి. దీని కలప నుంచి పలకలు, అగ్గిపుల్లలు తయారు చేస్తారు” అని చెప్పారు. ‘‘వీటికి ఒకేసారి పూత వచ్చినప్పుడు ఏదైనా వాసన రావొచ్చు. దాని వల్ల సైనెస్, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. అంతకు మించి ఎటువంటి సమస్యలు ఈ చెట్టు నుంచి రావు’’ అని డాక్టర్ ఈ. నర్సింహమూర్తి బీబీసీతో చెప్పారు.
 
జీవీఎంసీ అధికారులు ఏమంటున్నారంటే...
విశాఖలోని ఏంవీపీ కాలనీ, ఉషోదయ జంక్షన్, జీవీఎంసీ పరిసర ప్రాంతాలు, అక్కయ్యపాలెం, జాతీయ రహదారుల డివైడర్లపై ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజల నుంచే ఈ చెట్లను తొలగించాలంటూ జీవీఎంసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. “ఈ చెట్టు వల్లే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రపరంగా నిరూపితం కాలేదు. అయినప్పటికీ ఈ చెట్లు వల్లే శ్వాసకోస ఇబ్బందులు, దగ్గు, ఆయాసం వస్తున్నట్లు మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆస్థమా, క్షయ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యవంతులకు ఈ చెట్ల వల్ల ఇబ్బందులు వస్తున్నట్లు ఎక్కడా ఫిర్యాదులు రాలేదు” అని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారి దామోదర్ బీబీసీతో అన్నారు.
 
“కానీ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చెట్లను తొలగిస్తున్నాం. వీటి స్థానంలో వేప మొక్కలు నాటాలని నిర్ణయించాం. అయితే ఇటీవల కాలంలో ఈ చెట్ల విషయంలో ఫిర్యాదులు తగ్గాయి. ప్రజలే ఈ చెట్లను స్వచ్ఛందంగా తొలగించి...వాటి స్థానంలో వేరే మొక్కలు వేస్తామన్నా కూడా దానికి అంగీకరిస్తాం. అలాగే వారికి సరికొత్త మొక్కలను కూడా జీవీఎంసీయే ఇస్తుంది” అని దామోదర్ చెప్పారు.
 
ఇక ఈ చెట్లను వేయకూడదా?
ఈ చెట్లను పూర్తిగా తొలగించడం కంటే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ చెట్లను ఉంచడమే మంచిదంటున్నారు వృక్షశాస్త్ర వేత్తలు. అసలు ఈ తరహా చెట్లను వేసే ముందు సంస్థలు, ప్రభుత్వాలు, కార్పోరేషన్లు వంటివి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఏడాకుల చెట్లు వంటివి ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు. ఏయూ వృక్షశాస్త్ర విభాగానికి చెందిన పోస్ట్ డాక్టర్ ఫెలో కె. ప్రకాశరావు ఏమన్నారంటే... ఏదైనా సంస్థ మాస్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆ మొక్కలు ఎంత వరకు ఉపయోగకరం, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అనే విషయంపై వృక్షశాస్త్ర నిపుణులను సంప్రదించాలి. ఆ మొక్కలు భవిష్యత్తులో ఏమైనా పువ్వులు, కాయలు, పళ్లు ఇస్తాయా? వాటి వల్ల ఇబ్బందులేమైనా వచ్చే అవకాశం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలి.
 
ఇప్పుడు మొక్కలు ఎక్కువగా వేసిన చోటు, రానున్న రోజుల్లో నివాస ప్రాంతాలుగా మారితే ఇబ్బందులు కలిగించని మొక్కలనే ఎంచుకోవాలి. మొక్కలు నాటేటప్పుడు ఆ ప్రాంతానికి అవి సరిపోతాయా, అక్కడ వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయగలవా అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. “ఏడాకుల చెట్లు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని తేల్చి చెప్పిన పరిశోధనలు ఏమీ లేవు. ఏడాకుల చెట్ల నుంచి వస్తున్న గాలితో ఆ చెట్ల పుప్పొడి కలుస్తుందా? అలా జరిగినప్పుడు ఆ గాలి ఊరిపితిత్తుల్లోకి వెళ్లినప్పుడు, చర్మానికి తగిలినప్పుడు ఆ వ్యక్తిలో ఏదైనా మార్పు వస్తోందా? లాంటి విషయాలు పరిశోధన చేయాలి. అందుకే ప్రస్తుతానికి ఈ చెట్లని చెడ్డవని చెప్పడానికి వీల్లేదు” అని విశాఖకు చెందిన వైద్యులు డాక్టర్ కుటికుప్పల సూర్యారావు బీబీసీతో అన్నారు.