దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన గాజీపుర్, సింఘూ, టిక్రీల్లో సోమవారం ఉదయం నుంచి పోలీసులు భారీ భద్రత చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లను మూసేశారు. దీంతో ఈ మూడు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మూడు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర పభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ మూడు ప్రాంతాల్లో రైతులు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు.
ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే...
గాజీపుర్ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న స్థలంలో ఆదివారం సాయంత్రం భద్రతా చర్యలు పెంచారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దిల్లీ వచ్చే రహదారులపై వివిధ స్థాయిల్లో అవరోధాలు పెట్టి మూసేశారు. కాలి బాటలను సైతం మూసేశారు. ఈ రోజు ఉదయం నాకు దారి వెతుక్కునేందుకే రెండు గంటలు సరిపోయింది. ఈ ప్రాంత డీసీపీని సాయం కోరా. ఆయన సాయం చేసేందుకు ప్రయత్నించినా, చాలా సేపు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఉండిపోయా అని సీనియర్ పాత్రికేయుడు ప్రభాకర్ మిశ్ర అన్నారు.
ఆయన రెండు నెలలుగా దిల్లీలో రైతుల ఆందోళనల గురించి వార్తలు, కథనాలు రాస్తున్నారు. ఆనంద్ విహార్ గుండా గాజియాబాద్ వచ్చే మార్గం మాత్రమే తెరిచి ఉంది. ఈ మార్గంలోనూ రోడ్డుకు ఒకే వైపు తెరిచిపెట్టారు. దీంతో ట్రాఫిక్ కొన్ని కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఇలా దారులన్నీ ఎందుకు మూసేయాల్సి వచ్చిందన్నదానిపై దిల్లీ పోలీసులు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీసు సిబ్బంది మాత్రం పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నారు.
ఎవరూ ముందుకు వెళ్లకుండా పర్యవేక్షణ చేసేందుకు తమను నియమించారని గాజీపుర్‌లో ఉన్న కొంతమంది యువకులు చెప్పారు. గాజీపుర్‌లో రైతులు తిరిగి పోగైన తర్వాత వారి గుంపు మరింత పెరుగుతోంది. తమ టెంట్లు మరింత ముందుకు కదలకుండా, పోలీసులు ఈ చర్యలు తీసుకుంటూ ఉండొచ్చని రైతులు అంటున్నారు. ఇక్కడి వసుంధర, వైశాలీ, ఇందిరాపురం, కౌశాంబీ లాంటి ప్రాంతాల్లో ఉన్న చాలా మంది దిల్లీలో ఉద్యోగాలు చేస్తుంటారు. రహదారులు మూసేయడంతో వాళ్లంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. నేను ఇక్కడే ఉండేవాణ్ని కాబట్టి కాలి నడకన వెళ్లే దారులు తెలుసు. కానీ, అవి తెలియని చాలా మంది చాలా ఇక్కట్లు పడుతున్నారు అని నొయిడా 62 సెక్టార్‌లో రైల్వే పరీక్ష రాసి తిరిగివస్తున్న మనీష్ యాదవ్ బీబీసీతో చెప్పారు.
దిల్ నవాజ్ పాషా, బీబీసీ ప్రతినిధి- టిక్రీ సరిహద్దు నుంచి
టిక్రీ సరిహద్దులో పోలీసులు కాంక్రీటు అవరోధాలు ఏర్పాటు చేశారు. వాహనాలు ముందుకు రాకుండా నిరోధించేందుకు రోడ్లపై పదునైన మేకులతో అవరోధాలు పెట్టారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 2 వరకూ పొడగించారు. ఈ చర్యలన్నీ కుట్రపూరితంగా ఉన్నాయని ఇక్కడున్న రైతులు అంటున్నారు. ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నామంటున్న ప్రభుత్వం సరిహద్దుల్లో ఇలాంటి అవరోధాలు ఏర్పాటు చేస్తోంది అని కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన అనూప్ చనోత్ అన్నారు.
మేం ఇక్కడ బైఠాయించి శాంతిపూర్వకంగా నిరసన తెలియజేస్తున్నాం. మేం ఇక్కడే ఉంటాం. ఒకవేళ ముందుకు కదిలి పార్లమెంటును ముట్టడించాలనుకున్నా ఈ అవరోధాలు మమ్మల్ని ఆపలేవు. ప్రభుత్వం కుట్ర పన్నుతోంది అని ఆయన అన్నారు. ఇంటర్నెట్‌ను కూడా నిలిపేశారు. అవసరమైన సూచనలను కూడా మేం అందరికీ తెలియజేయలేకపోతున్నాం. ట్విటర్‌లో రైతు ఉద్యమకారుల ఖాతాలను మూసేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో మా గొంతు నొక్కుతున్నారు. ఓ రకంగా ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. ఈ ఒత్తిళ్లన్నీ ఉన్నా మేం ఇలాగే నిలబడతాం. మా నిరసనలు కొనసాగుతాయి అని అనూప్ వ్యాఖ్యానించారు. సింఘూ సరిహద్దులో భద్రతా చర్యలను పెంచుతున్న విషయం వాస్తమమేనని దిల్లీ పోలీసు శాఖ సంయుక్త కమిషనర్ (నార్తర్న్ రేంజ్) ఎస్‌ఎస్ యాదవ్ బీబీసీతో చెప్పారు. ఎంత మంది భద్రతా సిబ్బందిని నియమించారన్న విషయాన్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
కుశాల్ లాలీ, బీబీసీ ప్రతినిధి- సింఘూ సరిహద్దు నుంచి
సింఘూ సరిహద్దులోనూ పోలీసులు బారికేడ్లు పెట్టారు. సింఘూ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల ముందే అవరోధాలు పెట్టారు. రోడ్డును తవ్వేశారు. కొన్ని వాహనాలకు మాత్రమే బారికేడ్లను దాటేందుకు అనుమతిస్తున్నారు. మీడియా వాహనాలను కూడా ఆపుతున్నారు. నరేలా నుంచి ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్న 46 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ట్రంప్ మెక్సికో సరిహద్దుల్లో నిర్మిస్తానన్నట్లుగా... దిల్లీ, హరియాణా సరిహద్దుల్లో మోదీ ప్రభుత్వం గోడ నిర్మిస్తోంది అని సింఘూ సరిహద్దులో ఉన్న రైతు నాయకుడు సుర్‌జీత్ సింగ్ అన్నారు.
ఇంటర్నెట్‌ను ఆపేసి, అవరోధాలు సృష్టించి నిరసనల వార్తలు బయటకురాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్నామ్ సింగ్ పన్నూ అన్నారు. తమ ప్రచార సాధానలు ఉపయోగించి రైతుల ఆందోళనలు బలహీనమయ్యాయని తప్పుగా ప్రచారం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, అది నిజం కాదు. హరియాణా, పంజాబ్‌ల నుంచి రైతులు ఇంకా వస్తున్నారు అని సత్నామ్ చెప్పారు.
ప్రభుత్వం అమానవీయ చర్యలకు పాల్పడుతోంది. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. ఇంటర్నెట్‌ను ఆపేశారు. ఇప్పుడు బారికేడ్లు పెడుతోంది. ప్రభుత్వం చర్చలు జరపాలనుకుంటే, అందుకు తగిన వాతావరణం నెలకొనేలా చూడాలి అని సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకుడు సత్నామ్ సింగ్ అజ్నారా అన్నారు. అన్ని సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల మనోబలాన్ని దెబ్బతీయాలనే ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. కానీ, రైతులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయించుకుని, కనీస మద్దతు ధర చట్టం సాధించాకే వెనుదిరుగుతారు అని సత్నామ్ సింగ్ పన్నూ బీబీసీతో అన్నారు.
రెండు నెలలుగా జరుగున్న రైతుల ఆందోళనలతో తమకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదని, కానీ జనవరి 26 తర్వాత ప్రభుత్వం చేపడుతున్న బారికేడింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక యువకుడు సాగర్ అన్నారు. సోనీపత్ నుంచి వంద మంది మహిళలు ఓ ట్రాక్టర్ ట్రాలీలో కూర్చొని సింఘూ సరిహద్దుకు చేరుకున్నారు. మోదీ ప్రభుత్వం మా స్థైర్యాన్ని దెబ్బతీయలేదు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకునే మేం వెనక్కివెళ్తాం అని ఆ మహిళలు బీబీసీతో అన్నారు.