గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (14:44 IST)

జీ-20 సదస్సు: డోనల్డ్ ట్రంప్ - నరేంద్ర మోదీ ఏ అంశాలపై చర్చించారు?

జీ-20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ట్రంప్‌తో తాను చర్చించినట్లు మోదీ ట్విటర్ ద్వారా తెలిపారు.

ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతపరమైన బంధాలను పెంపొందించుకోవడం, సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకోవడం గురించి సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. అమెరికాతో ఆర్థిక, సాంస్కృతికపరమైన బంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ వ్యాఖ్యానించారు.
 
అంతకుముందు ట్రంప్, మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా సదుపాయాల పెంపు గురించి ఈ భేటీలో చర్చలు జరిగినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ భేటీల తర్వాత బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల అధినేతల సమావేశం కూడా జరిగింది.
 
జపాన్‌లోని ఒసాకా నగరంలో జీ-20 దేశాల సదస్సు జరుగుతోంది. ఈనెల 29 వరకు ఇది కొనసాగుతుంది. ఈ సమయంలో ఫ్రాన్స్, టర్కీ, కెనడాలతో పాటు పలు దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిన పలు అంశాలపై జీ-20 సభ్య దేశాల నాయకులతో చర్చించి, ఆయా అంశాలపై భారత అభిప్రాయాలను మోదీ తెలియజేస్తారని భారత ప్రధాని కార్యాలయం పేర్కొంది.
 
భారత్‌పై ట్రంప్ అసంతృప్తి
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్ సుంకాలు పెంచడం పట్ల ట్రంప్ ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. "చాలా ఏళ్లుగా అమెరికా వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధిస్తూ వస్తోంది, ఇటీవల ఆ సుంకాలను మళ్లీ పెంచింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, భారత్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ విషయంపై ప్రధాని మోదీతో చర్చించేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను" అని ట్రంప్ ట్వీట్ చేశారు.
 
కొంతకాలం క్రితం 'వాణిజ్య ప్రాధాన్య హోదా' (జీఎస్‌పీ) జాబితా నుంచి భారత్‌ను అమెరికా తొలగించింది. దాని కారణంగా భారత ఎగుమతిదారులు తమ ఉత్పత్తులపై అమెరికాలో 10 శాతం అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుంది. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ) కార్యక్రమాన్ని 1976 నుంచి అమెరికా అమలు చేస్తోంది. జీఎస్పీ జాబితాలో ఉన్న దేశాలకు వాణిజ్యపరంగా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆ హోదా కలిగిన దేశాలు, అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు. అది అమెరికాకు 120 ఇతర దేశాలకు మధ్య జరిగిన ఒప్పందం.
 
భారత్ ప్రతీకార చర్య
జీఎస్పీ నుంచి భారత్‌ను ట్రంప్ తొలగించిన తర్వాత కొంతకాలం పాటు ప్రతీకార చర్యలు తీసుకోకుండా వేచిచూసింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలను పెంచలేదు. కానీ, తాజాగా బాదం, వాల్‌నట్స్, పప్పు ధాన్యాలు సహా అమెరికా నుంచి దిగుమతి అయ్యే 29 రకాల ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలు పెంచింది. ఈ నిర్ణయం జూన్ 16 నుంచి అమలులోకి వచ్చింది.
 
ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించి, నరేంద్ర మోదీ రెండోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీకి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఇరువురి మధ్య ముఖాముఖిగా శుక్రవారమే మొదటిసారి సమావేశం జరిగింది.
 
ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపెయో భారత్‌ పర్యటనకు వచ్చిన తర్వాత మోదీ, ట్రంప్‌ల ద్వైపాక్షిక సమావేశం ఖరారైంది. మైక్ పాంపెయో తన పర్యటనలో ప్రధాని మోదీ, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్‌‌లను కలిశారు.
 
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించాలన్న భారత నిర్ణయం పట్ల గతంలోనూ డోనల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ సుంకాలు విధించడంలో 'కింగ్' అని ఆయన అభివర్ణించారు. అమెరికా అధికారిక లెక్కల ప్రకారం, 2018లో భారత్‌ నుంచి విదేశాలకు 56 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా, అందులో అమెరికాకు ఎగుమతి అయిన ఉత్పత్తుల విలువ 6.3 బిలియన్ డాలర్లు.