హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలు: సైదిరెడ్డికి ఆధిక్యం.. విజయం దిశగా టీఆర్ఎస్
తెలంగాణలోని హుజూర్‌నగర్ శాసన సభ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తర్వాత స్థానంలో కాంగ్రెస్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి 109772 ఓట్లు (56.5 శాతం) లభించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతికి 67287 ఓట్లు (34.6 శాతం) లభించాయి.
ఉదయం 11.58 నిమిషాల సమయానికి సైదిరెడ్డికి 50,779 ఓట్లు, పద్మావతికి 32,196 ఓట్లు వచ్చాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 21న జరిగిన ఉపఎన్నికల్లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు పోటీ చేశారు.
ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది.
2018 ఎన్నికల్లో
గత ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు. శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు. ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.
కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ
ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.