శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (14:48 IST)

ఉత్తమ్ కోటలో వికసించిన గులాబీ : 33 వేల ఓట్ల మెజార్టీ

తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను ఇటు తెరాస, అటు కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో విజయం కోసం ఇరు పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టగా, మధ్యాహ్నం రెండున్నర గంటలకే తుది ఫలితాన్ని వెల్లడించారు. ఈ ఫలితంలో తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. ఈయనకు లక్షా ఎనిమిదివేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 
 
అలాగే, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డికి 74638 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెరాస అభ్యర్థి 33363 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసిన అభ్యర్థిగానీ, బీజేపీ అభ్యర్థిగానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఉత్తమ్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ స్థానం ఇపుడు తెరాస వశమైంది.