శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (11:48 IST)

లెక్కింపు పూర్తికాకముందే ఓటమిని అంగీకరించిన ఉత్తమ్ సతీమణి.. నిష్క్రమణ

తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం చేపట్టారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధిక్యం సాధించినప్పటికీ... ఆ తర్వాత అధికార తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే లెక్కింపు కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఈ ఓట్ల లెక్కింపులో 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసేవరకు తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 18 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమైపోగా, ఆయన మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. తాను ముందుగా చెప్పినట్టుగానే బంపర్ మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకోనున్నానని ఈ సందర్భంగా సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సైది రెడ్డికి 51032 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 32 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీతో పాటు తెరాస అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందువల్లే ప్రచారం హోరాహోరీగా సాగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీ నేతలంతా హుజూర్ నగర్‌లోనే మకాం వేసి ప్రచారం చేశారు. అయితే, ఓటర్లు మాత్రం కారుకే పట్టంకట్టారు. ఫలితంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉండే హుజూర్ నగర్‌లో తొలిసారి గులాబీ జెండా ఎగరనుంది.