ప్రగతి భవన్‌ను బద్ధలు కొట్టడం ఖాయం... రేవంత్ : బేగంపేట్ మెట్రో స్టేషన్ మూసివేత

revanth reddy
ఠాగూర్| Last Updated: సోమవారం, 21 అక్టోబరు 2019 (14:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సోమవారానికి 17వ రోజుకు చేరుకుంది. ఈ కార్మికులకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది.

దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. సోమవారం వేకువజాము నుంచే కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడే గృహనిర్బంధంలో ఉంచారు. పలువురుని ముందుగా అరెస్టు చేశారు. అయితే, రేవంత్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి తదితర సీనియర్ నేతలు, యువజన, విద్యార్థి సంఘ నేతలు అడ్డంకులను దాటుకుని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి నలుపు రంగు టీషర్ట్‌తో బైక్‌పై నేరుగా ప్రగతిభవన్ వైపుగా దూసుకెళ్లారు. గేటు వద్దకు చేరుకోగానే.. పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పరిస్థితి ఇలాగే కొనసాగితే నాలుగు కోట్లమంది తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం ఖాయమని హెచ్చరించారు. 'ఇవాళ ప్రగతి భవన్ గేట్లను తాకుతాం అన్నాం.. తాకినం.. రేపు బద్దలు కొడతాం' అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ నియంతృత్వ, నిర్బంధ పోకడలను సహించేది లేదన్నారు.

ఇదిలావుంటే, ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట మెట్రోస్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రగతి భవన్‌కు సమీపంలోనే ఇది ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె చేస్తుండడం, మరోవైపు బేగంపేట మెట్రోస్టేషన్‌ కూడా మూసేయడంతో ఇక్కడ దిగాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమీర్ పేట వైపు నుంచి వచ్చే మెట్రో రైలును బేగంపేట స్టేషన్ వద్ద ఆపకుండా ప్రకాశ్ నగర్ వద్ద ఆపుతున్నారు. అలాగే, ప్రకాశ్ నగర్ మీదుగా వెళ్లే సమయంలోనూ బేగంపేట వద్ద ఆపకుండా అమీర్ పేట వద్ద ఆపుతున్నారు. మళ్లీ ఈ మెట్రోస్టేషన్‌ను ఎప్పుడు తెరుస్తారన్న విషయంపై అధికారులు స్పష్టతనివ్వలేదు.దీనిపై మరింత చదవండి :