సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (14:19 IST)

కొండను తవ్వి ఎలుకను పట్టారు.. అది కూడా చనిపోయిన ఎలుక...

హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఓ చచ్చిన ఎలుకతో పోల్చుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. 
 
మహారాష్ట్రతో పాటు హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీని ఓ చచ్చిన ఎలుకతో పోల్చారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారని... గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కొత్త అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతూ వచ్చారని అన్నారు. 
 
కానీ, మూడు నెలల పాటు కొత్త అధ్యక్షుడి కోసం దేశమంతా గాలించారని... ఆ తర్వాత సోనియా గాంధీనే మళ్లీ తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని... అది కూడా చచ్చిన ఎలుకను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఖట్టర్ చేసిన వ్యాఖ్యల్లో మహిళా వ్యతిరేక గుణాలు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
 
రెండు నెలల క్రితం కూడా ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకున్నామని... ఇకపై కశ్మీర్ నుంచి తెచ్చుకోవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.