మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2019 (19:23 IST)

టిక్ టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే సీటు.. ఇక అలా వాడుకుంటారట..!? (video)

సోషల్ మీడియా ద్వారా నష్టాలు కొన్ని జరుగుతున్నప్పటికీ.. లాభాలు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూనే వున్నాయి. తప్పుడు ప్రచారంతో భారీ నష్టాలు జరుగుతున్నా.. సోషల్ మీడియాను ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగిస్తూ వున్నారు. తాజాగా సరదా వీడియో యాప్ టిక్‌టాక్ ఓ మహిళను స్టార్‌ను చేసింది. అంతేగాకుండా, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ దొరికేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. హర్యానా చెందిన సోనాలీ ఫోగట్ టిక్ టాక్‌లో అనేక వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. వీడియోల క్వాలిటీ ఫలితంగా ఆమెకు ఫాలోవర్స్ పెరిగారు. దీంతో పలు రాజకీయ పార్టీలు కూడా ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదిపాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో భారతీయ జనతా పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఏకంగా సొనాలీకి అదంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించింది బీజేపీ. గురువారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో సొనాలీ ఫోగట్ పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అదంపూర్‌లో కాంగ్రెస్ కేడర్ బలంగా ఉండటంతో బీజేపీ సోనాలీని బరిలోకి దింపిందని తెలుస్తోంది. ఇకపోతే.. అదంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయికే కాంగ్రెస్ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే, సొనాలీ కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తోంది.
 
ఈ సందర్భంగా సోనాలి ఫోగట్ స్పందిస్తూ.. టిక్‌టాక్ వల్లే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నారు. మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ కేంద్రమంత్రి, దివంగత నేత సుష్మా స్వరాజ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తనకు ఆదర్శమని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా, తాను గత 12ఏళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్నానని తెలిపారు. మధ్యప్రదేశ్ ట్రైబల్ మోర్చాగా పనిచేసిన సమయంలో అక్కడి వారినంతా బీజేపీకి దగ్గర చేశానని చెప్పారు. అది తనకు చాలా ఆసక్తికర అనుభవమని తెలిపారు. తాను పలు సీరియల్స్, సినిమాల్లో కూడా నటించినట్లు చెప్పారు సొనాలి. 
 
అందుకే తాను టిక్‌టాక్ యాప్‌తో అభిమానులకు మరింత చేరువయ్యానని తెలిపారు. తనకు పార్టీ టికెట్ కేటాయించిన తర్వాత తాను బాలికల భద్రత, యువతలో జాతీయభావం, దేశభక్తి పెంపొందించే వీడియోలను పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్‌ను యువతో స్ఫూర్తి నింపేలా వాడుకుంటానని చెప్పారు. గత 50ఏళ్లుగా అదంపూర్ నియోజకవర్గంలో ఒకే కుటుంబం అధికారంలో ఉందని, అయితే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.
 
కాంగెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయి ఓ వ్యాపారి అని, అతనికి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలియవని సొనాలి వ్యాఖ్యానించారు. అతను కూడా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిసిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.