1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : గురువారం, 21 జులై 2022 (17:16 IST)

Indian Rupee: పతనమవుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం - భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి ఏమిటి?

rupee coins
భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుతం రెండు రకాల సమస్యలను ఎదుర్కుంటోంది. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గిన తరువాత దేశం ఆర్థికంగా కోలుకుంటుందని భావించారు. కానీ, పడిపోతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ధరలు ఆర్థికవ్యవస్థ గాడిలో పడకుండా అడ్డుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా నమోదయింది. మే నెలలో 7.04 శాతం కన్నా ఇది కాస్త తగ్గినప్పటికీ రిజర్వు బ్యాంకు గరిష్ట పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.

 
మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోతోంది. మంగళవారం డాలరుకు రూపాయి విలువ 80కి చేరింది. రూపాయి విలువ పడిపోతున్నకొద్దీ భారతదేశ దిగుమతుల ధరలు పెరిగిపోతాయి. ఫలితంగా, దేశంలో వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. కోవిడ్ వలన సప్లయి చైన్ దెబ్బతినడం ప్రధాన కారణం కాగా, తాజాగా రష్యా-యుక్రెయిన్ యుద్ధం వలన చమురు, ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఇవన్నీ భారత ఆర్థికవ్యవస్థకు సవాలుగా నిలిచాయి. కోవిడ్ కారణంగా దేశ ప్రజల ఆదాయం తగ్గింది. ధరల పెరుగుదల సాధారణ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కొనితెస్తోంది.

 
ద్రవ్యోల్బణం, రూపాయి పతనంపై నిపుణులు ఏమంటున్నారు?
ఆర్థిక విశ్లేషకురాలు పూజా మెహ్రా మాట్లాడుతూ, “కోవిడ్‌కు ముందు కూడా భారతదేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంది. కరోనా మహమ్మారి వలన సరఫరా రంగంలో సమస్యల కారణంగా ద్రవ్యోల్బణం ఇంకా పెరిగింది. ఇది కాకుండా, 2019లో ఆర్‌బీఐ అనుసరించిన విధానాలు కూడా ఇందుకు కారణం. ఇటీవల ద్రవ్యోల్బణానికి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ప్రధాన కారణం" అంటూ వివరించారు. "ప్రభుత్వ విధానాల వల్ల ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచలేదు. కానీ, ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచేశారు. దీంతో ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగింది. మరోవైపు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో చమురు ధర పెరిగింది. దీని ప్రభావం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. కోవిడ్ సమయంలో సరఫరా సమస్యలు, రష్యా-యుక్రెయిన్ యుద్ధం పరిస్థితులను మరింత దిగజార్చాయి" అని ఆమె చెప్పారు.

 
'ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెపో రేటు పెంచాలి'
ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటు (ఆర్‌బీఐ, బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు) పెంచడం సరైన చర్య అని పూజా మెహ్రా అభిప్రాయపడ్డారు. "ఆర్‌బీఐ రెపో రేటును పెంచకపోతే, అంటే పెట్టుబడిదారులకు ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వకపోతే వాళ్లు ఇక్కడి నుంచి డబ్బు తీసేసి, విదేశాలకు తరలిస్తారు. ఎందుకంటే, అమెరికా సెంట్రల్ బ్యాంకు (ఫెడరల్ రిజర్వు బ్యాంకు) వడ్డీ రేటు పెంచుతోంది. అందుకే మన దేశం నుంచి డాలర్లు తరలిపోతున్నాయి. సహజంగా పెట్టుబడిదారులు ఎక్కడ ఎక్కువ వడ్డీ లభిస్తుందో అక్కడే పెట్టుబడులు పెడతారు. కాబట్టి, మనం వడ్డీ రేటు పెంచి పెట్టుబడిదారులను ఆపకపోతే డాలర్లు తరిగిపోకుండా ఆపలేం. డాలర్లు తగ్గిపోతే, రూపాయి విలువ మరింత బలహీనపడుతుంది. దిగిమతులు మరింత ఖరీదవుతాయి. ఫలితంగా, దేశంలో ధరలు పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది" అని పూజా మెహ్రా వివరించారు.

 
జీఎస్టీని పెంచడం సరైన చర్యా?
ఓ పక్క ధరలు పెరిగిపోతుంటే, ప్రభుత్వం జీఎస్టీని పెంచడం సరైన చర్యేనా? ఇది ప్రజలపై రెట్టింపు భారాన్ని మోపదా? దీనిపై పూజా మెహ్రా ఇలా చెప్పారు. "జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు సగటు తటస్థ రేటును 12 శాతంగా ఉంచడంపై చర్చ జరిగింది. కానీ, రాజకీయ కారణాల వల్ల ఈ రేటును తగ్గించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. అందువల్ల, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించలేదు. మరికొన్ని వస్తువులపై 5-10 శాతం మాత్రమే పన్ను వేశారు. దీని వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, పెట్రోలు వంటి ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేవు. ప్రభుత్వానికి తగినంత రాబడి లేదు. అందుకే జీఎస్టీని పెంచింది. జీఎస్టీ ద్వారా ఆదాయం రాకపోతే ప్రభుత్వ వ్యయం ఎలా సాగుతుంది?" అని ఆమె అన్నారు.

 
ఈ ద్రవ్యోల్బణం న్యూ నార్మల్ అవుతుందా?
పెరిగిన ద్రవ్యోల్బణం రేటు భారతదేశంలో న్యూ నార్మల్ అవుతుందా? ద్రవ్యోల్బణం ఎప్పటికీ ఏడు-ఎనిమిది శాతం లేదా అంతకంటే ఎక్కువగానే ఉండబోతోందా? న్యూ నార్మల్ అనే పదం విదేశాలకు సంబంధించిన చర్చల్లో వస్తోందని పూజా మెహ్రా అన్నారు. "అక్కడ ద్రవ్యోల్బణం రెండు శాతానికి అటూ ఇటుగా ఉంటుంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఉండడంతో న్యూ నార్మల్ అనే మాట వినిపిస్తోంది. చైనా నుంచి వచ్చే చౌకైన వస్తువుల కారణంగా అక్కడ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. కానీ, సప్లయి చైన్‌లో సమస్యల వల్ల చైనా వస్తువుల ధరలు కూడా పెరిగాయి. రెండవది, ఇప్పుడు ఆ దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడటంలేదు. అందుకే అక్కడ ధరలు కాస్త పెరగగానే న్యూ నార్మల్ అనే మాట వస్తోంది.

 
రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా కూడా విదేశాల్లో సప్లయి వైపు నుంచి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. కానీ, భారతదేశంలో పరిస్థితి వేరు. మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనకు ధరలు పెరగడం కొత్తేం కాదు. అందుకే, ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి పరిమితం చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి, కోవిడ్ సమయంలో ఆర్‌బీఐ చాలా నోట్లను ముద్రించింది. ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడంలో సమస్యలు రాకుండా నోట్లను ముద్రించింది. ద్రవ్యోల్బణం పెరగడంలో దీని హస్తం కూడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల, ధరలు అదుపులోకి రావచ్చు. అయితే, రష్యా-యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంతవరకు చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కష్టం. ఎందుకంటే మన దేశానికి అవసరమైన చమురులో మూడింట రెండొంతులు బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం చాలా వ్యయం అవుతుంది" అని పూజా మెహ్రా వివరించారు.

 
రూపాయి బలహీనపడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?
ద్రవ్యోల్బణంతో పాటు భారతదేశాన్ని కలవరపెడుతున్న మరో అంశం రూపాయి పతనం. మారకపు విలువ నిరంతరంగా బలహీనపడుతోంది. దీనివల్ల దిగుమతుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువ. దానివల్ల, ప్రభుత్వ ఖజానాలో డాలర్లు వేగంగా తరిగిపోతున్నాయి.

 
రూపాయి పతనం ఎప్పుడు ఆగుతుంది? ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు చక్కదిద్దుకుంటాయి?
రూపాయి బలహీనపడడం ఎగుమతులకు మంచిదేనని సీనియర్ జర్నలిస్ట్, ఆర్థిక విశ్లేషకుడు అలోక్ జోషి అభిప్రాయపడ్దారు. "రూపాయి పడిపోతోంది అని చెప్పడం కన్నా డాలరు ఖరీదవుతోంది అని చెప్పడం మేలు. అమెరికా రిజర్వు బ్యాంకు లిక్విడిటీ అబ్జార్ప్షన్ కారణంగా ఇది జరుగుతోంది. కోవిడ్ సమయంలో ఫెడరల్ రిజర్వ్ చాలా డాలర్లను ముద్రించింది. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. వడ్డీ రేటును పెంచడం ద్వారా ఈ పనిచేస్తున్నారు. అధిక వడ్డీ రేటు కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి డాలర్లు అమెరికాకు తరలిపోతున్నాయి. భారత్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడి పెట్టుబడిదారులందరూ అమెరికా వైపు వెళ్లిపోతున్నారు. అందువల్ల, డాలరుతో పోల్చి చూస్తే రూపాయి మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి" అని జోషి వివరించారు.

 
రూపాయి బలహీనపడడం అంత చెడ్డ విషయంగా అలోక్ జోషి భావించట్లేదు. "రూపాయి విలువ తగ్గడం వల్ల మన దేశ ఎగుమతులు చౌకగా మారుతాయి. అందువల్ల, ఎగుమతుల నుంచి మనం ప్రయోజనం పొంచవచ్చు. చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ కరెన్సీ విలువను తగ్గించడం ద్వారా ప్రపంచ మార్కెట్‌లో తమ వస్తువులను చౌకగా విక్రయించాయి. దాంతో, ఎగుమతులు పెరిగాయి. దీని నుంచి ఆ దేశాలు ప్రయోజనం పొందాయి. మనకు డాలర్ల అవసరం ఉంది. కాబట్టి, మనం ప్రపంచ మార్కెట్‌లో తక్కువ ధరలకు వస్తువులను అమ్మడం ద్వారా ఎగుమతులు పెంచుకుని, ఎక్కువ డాలర్లు సంపాదించవచ్చు. మనకు దిగుమతులు ఎక్కువ. వాటి కోసం ఎక్కువ డాలర్లు కావాలి.
 
రూపాయి విలువ పెంచడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?
"రూపాయిని కృత్రిమంగా బలోపేతం చేయవచ్చు. కానీ, ఇది భారత్‌కు హానికరం. బదులుగా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించి ఎగుమతులు పెంచే చర్యలు చేపట్టాలి" అని అలోక్ జోషి అన్నారు. రూపాయి దారుణంగా పడిపోతే, పాకిస్థాన్, శ్రీలంక పరిస్థితి మనకూ వస్తుందా? ఆ దేశాలతో భారతదేశాన్ని పోల్చడం అర్థరహితమని జోషి అన్నారు. "అలాంటి పరిస్థితి భారత్‌లో ఎన్నటికీ రాదు. మన దేశీయ మార్కెట్ చాలా బలంగా ఉంది. దాని ఆర్థిక పరిమాణం కూడా చాలా పెద్దది. అందువల్ల భారత్‌లో పాకిస్తాన్‌, శ్రీలంక వంటి పరిస్థితిని ఊహించడం అవివేకం" అని ఆయన అబిప్రాయపడ్డారు.