రెండో భార్యకు ఆస్తి రాసిస్తే చెల్లుతుందా చెల్లదా? కరోనాతో మరణించిన ఎస్ఐ కేసులో కోర్టు ఏం చెప్పింది?

court
బిబిసి| Last Updated: బుధవారం, 16 సెప్టెంబరు 2020 (16:59 IST)
రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి మరణిస్తే ఆయన మరణం తరువాత ఏదైనా ప్రభుత్వ పరిహారం దక్కే అవకాశముంటే అది ఎవరికి చెందుతుంది? మొదటి భార్యాకా.. రెండో భార్యకా? ఇటీవల బాంబే హైకోర్టుకు ఇలాంటి కేసు వచ్చింది. మహారాష్ట్ర రైల్వే పోలీస్ విభాగంలో పనిచేసిన ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ కోవిడ్‌తో మరణించారు.

ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 సమయంలో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 50 లక్షల బీమా చేయడంతో ఆ మొత్తం, పోలీస్ సంక్షేమ నిధి, గ్రాట్యుటీ అన్నీ కలిపి సుమారు రూ. 65 లక్షలు ఆయన కుటుంబానికి పరిహారం అందే అవకాశం ఏర్పడింది. ఈ పరిహారం ఇవ్వబోతున్న సమయంలో మృతుడి కుమార్తె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనకు, తన తల్లికి న్యాయం చేయాలని.. ప్రభుత్వం నుంచి అందే పరిహారం మొత్తాన్ని ఇద్దరు భార్యలకు సమానంగా పంచాలని కోరారు.

ఈ కేసును జస్టిస్ కతావాలా బెంచ్ విచారించింది. మృతుడి మొదటి భార్య కూతురు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు హాజరయ్యారు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడనే విషయం అసలు తమకు తెలియదని ఆమె వాదించారు. కానీ ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్టు మృతుడి మొదటి భార్యకు తెలుసని రెండో భార్య లాయర్ వాదించారు. రెండో భార్య తన కుమార్తెతో కలిసి ధారావిలోని రైల్వే కాలనీలో ఉంటున్నారు.

‘బీబీసీ’తో మాట్లాడిన మృతుడి రెండో భార్య లాయర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు చెప్పారు. మృతుడి మొదటి వివాహం 1992లో జరిగిందని, 1998లో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని చెప్పారు. ఈ రెండు పెళ్లిళ్లనూ హిందూ వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ చేశారని తెలిపారు. అప్పటివరకూ పరిహారం పంచుకోవడం వరకే పరిమితమైన ఈ కేసులో, ఇప్పుడు ఆ ఈ రెండు వివాహాల్లో ఏది చెల్లుతుంది అనే ప్రశ్న మొదలైంది.

రెండో పెళ్లిపై హిందూ మారేజ్ యాక్ట్ ఏం చెబుతుంది
హిందూ వివాహ చట్టం సెక్షన్-5 ప్రకారం మహిళలు, పురుషులు ఎవరైనా తమ మొదటి పెళ్లి రద్దయినప్పుడు, లేక మొదటి భార్య/భర్త చనిపోయినప్పుడు, లేదంటే విడాకులు తీసుకున్న తరువాత మాత్రమే రెండో పెళ్లి చేసుకోవడానికి వీలుంటుంది. మరోవైపు, భారతీయ వారసత్వ చట్టం విషయానికి వస్తే, ఒక వ్యక్తి చనిపోయే ముందు ఎవరి పేరున వీలునామా రాస్తే, అతడు సంపాదించిన ఆస్తి వారికే దక్కుతుంది.

కానీ, అసలు వీలునామా రాయకపోతే, అలాంటి పరిస్థితిలో ఆస్తి ఎవరికి చెందుతుంది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 8లో ఆస్తి హక్కు పొందడం కోసం 4 క్లాజ్‌లు ఏర్పాటు చేశారు. క్లాజ్ -1లో ఆస్తిని ఎలా పంచవచ్చు అనేదాని గురించి సెక్షన్ 10 చెబుతుంది. దిల్లీ జిల్లా కోర్ట్ లాయర్ మొహిందర్ సింగ్ దీని గురించి వివరించారు.


“హిందూ వారసత్వ చట్టంలో ఆస్తి హక్కులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. అందులో మొట్టమొదటి క్లాజ్-1 కేటగిరీలో భార్య, పిల్లలు, తల్లి.. కొడుకు ఒకవేళ చనిపోతే అతడి భార్య, పిల్లలు వస్తారు. కానీ ఒకవేళ కూతురు చనిపోయి ఉంటే అప్పుడు ఆస్తి హక్కు ఆమె పిల్లలకే ఉంటుంది. భర్తకు ఎలాంటి భాగం లభించదు. ఈ చట్టం ప్రకారం కుటుంబ పెద్ద సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు లభిస్తుంది”.

క్లాజ్-1లో ఆస్తి హక్కు పొందడానికి వారసులు ఎవరూ లేకపోతే, అలాంటి పరిస్థితుల్లో ఆస్తి హక్కు క్లాజ్-2 లోకి వెళ్తుంది. అందులో తండ్రి కాకుండా, తోబుట్టువులు, మిగతా బంధువులకు హక్కు లభిస్తుంది.


హిందూ వివాహ చట్టం ఏం చెబుతుంది
హిందూ వివాహ చట్టం గురించి లాయర్ సోనాలీ కడవాసరా వివరించారు. “హిందూ వివాహ చట్టం-1955కి ముందు హిందువులు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకోవడం చెల్లేది. అంటే, ఒక వ్యక్తి మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటే, దానిని చట్టపరంగా గుర్తింపు లభించేది. భర్త చనిపోయిన తర్వాత వితంతువులు, వారి పిల్లలకు ఆస్తిలో హక్కు కూడా ఉండేది. కానీ, దానిని మూడు భాగాలుగా విభజించి అందులో ఒక భాగాన్ని భార్యలు ఇద్దరికీ పంచేవారు. మృతుడికి ఇద్దరు భార్యలతో పిల్లలు ఉంటే, వారికి చెరో భాగాన్ని పంచేవారు.

అయితే, వివాహ చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిగిన రెండో వివాహాలు చెల్లవు. కానీ ఆ సంబంధం ద్వారా సంతానం ఉంటే, అలాంటప్పుడు ఆ పిల్లలకు చట్టబద్ధంగా ఆస్తిలో హక్కు లభిస్తుంది. ఎందుకంటే చట్టం ఆ పిల్లలను అక్రమ సంతానంగా భావించదు” అని చెప్పారు.


హిందూ వివాహ చట్టం రావడానికి ముందు ఎవరైనా రెండు పెళ్లిళ్లు చేసుకుని ఉంటే వాటిని చట్టవిరుద్ధంగా భావించలేం. కానీ, ఈ చట్టం వచ్చిన తర్వాత ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లికి ఎలాంటి గుర్తింపు ఉండదని కూడా ఈ చట్టం చెబుతుంది.

“ఎవరైనా ఒక వ్యక్తి మరో మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకుంటే, అప్పుడు ఆ వివాహానికి హిందూ వివాహ చట్టం ప్రకారం గుర్తింపు ఉండదు. కానీ, అతడు రెండో పెళ్లిని స్పెషల్ మారేజ్ యాక్ట్ ద్వారా రిజిస్టర్ చేయించినపుడు, దానికి తగినట్లు అతడు అన్ని నిబంధలను పాటించాడా, అనేది చూడాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మతం మారిన తర్వాత పెళ్లి చేసుకుంటే, అలాంటప్పుడు ఆస్తి హక్కులు అందించడం మరింత క్లిష్టం అవుతుంది” అంటారు సోనాలీ

కానీ, చనిపోవడానికి ముందు ఒక వ్యక్తి ‘వీలునామా’ రాసి ఉంటే, ఆయన తను సంపాదించిన ఆస్తిని ఎవరి పేరు మీదైనా రాయవచ్చు. అయితే దానికి వ్యతిరేకంగా మిగతా వారు పిటిషన్ వేయవచ్చు. కానీ దానికి బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.


మిగతా మతాల్లో నిబంధనలు ఎలా ఉన్నాయి
“ముస్లింలలో షియా, సున్నీలకు వేరువేరు చట్టాలు ఉన్నాయి. భారత్‌లో ఎక్కువగా సున్నీలు ఉన్నారు. వారిలో కూడా హనఫీ చట్టాన్ని అనుసరించేవారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మొదట ఆయన భార్యకు ఎంత డబ్బు నిర్ణయించారో దానిని అందిస్తారు. తర్వాత మృతుడి అంత్యక్రియలకు అయ్యే ఖర్చుకు ఉపయోగిస్తారు, ఆయనకు అప్పులు ఇచ్చినవారికి చెల్లిస్తారు.

ఇవన్నీ పోను మిగిలిన మొత్తంలో మూడింట ఒక వంతును వారసులకు ఇవ్వవచ్చు. క్రిస్టియన్లలో మూడింట ఒక వంతు ఆస్తిని భార్యకు, మిగతా రెండు భాగాలు పిల్లలకు పంచుతారు. మృతుడికి పిల్లలు లేకపోతే సగం భార్యకు, మిగతా సగం బంధువులకు చెందుతుంద’’ని లాయర్ మొహిందర సింగ్ చెప్పారు.


ఈ కేసులో పూర్తి విచారణల తర్వాత బాంబే హైకోర్టు “మృతుడి కుటుంబానికి దక్కాల్సిన పరిహారాన్ని మూడు భాగాలు చేసి మొదటి భార్యకు ఒక భాగం, ఇద్దరు భార్యలకు పుట్టిన ఇద్దరు కుమార్తెలకు ఒక్కో భాగం అందించవచ్చ”ని చెప్పినట్లు రెండో భార్య లాయర్ తెలిపారు.

కానీ తండ్రి స్థానంలో ఎవరికి ఉద్యోగం లభిస్తుంది, మిగతా అంశాలపై రెండు కుటుంబాలు చర్చించి సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ కేసులో తర్వాత విచారణ సెప్టెంబర్ 19న జరగనుంది.

దీనిపై మరింత చదవండి :