శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 6 మార్చి 2023 (11:35 IST)

కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంతం ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?

Nityananda
భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తాను ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టుకున్నారు. ఈ కైలాస దేశానికి ప్రతినిధినంటూ ఇటీవల ఒకామె ఐక్యారాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. చివరకు ఆ సమావేశాల నుంచి కైలాస ప్రతినిధి ప్రసంగాన్ని తొలగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ వివాదాన్ని పక్కన పెడితే మన కంటూ ఒక దేశం లేదా రాజ్యం ఉండొచ్చా? అంటే ఉండొచ్చు. ఇప్పటికే కొందరు నిత్యానంద మాదిరిగానే సొంత దేశాలను ప్రకటించుకున్న వారు ఉన్నారు.
 
సొంత దేశం ఎలా?
‘నా కంటూ ఒక దేశం... దానికి నేనే రాజు, నేనే మంత్రి’... ఇలా కలలు కనేవాళ్లు ఉన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నామని చెబుతున్న వాళ్లు కూడా ఉన్నారు. దేశం అనగానే ముందుగా మీకు కొంత భూమి ఉండాలి. లక్షల, కోట్ల ఎకరాలు కాక పోయినా ఒక్క ఎకరా ఉన్నా సరే దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 
 
కాకపోతే అది ఈ ప్రపంచంలో ఏ దేశం అధీనంలో లేని భూమి అయి ఉండాలి. అక్కడ మీ జెండాను పాతి ఇది నా దేశం అని చెప్పుకోవచ్చు. అంటార్కిటికాలో ఇలా ఎవరి అధీనంలో లేని ప్రాంతం చాలానే ఉంది. కాబట్టి అక్కడ జెండా పాతేసి దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే -50 డిగ్రీల చలిని తట్టుకుని ఉండగలగాలి. ఇక ఈజిప్టు, సుడాన్ మధ్య ఉండే బిర్ తావిల్ కూడా ఎవరీ అధీనంలో లేదు. కానీ అదంతా ఇసుక ఎడారీ. ఈ బిర్ తావిల్‌లో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఇండోర్‌కు చెందిన సుయాస్ దీక్షిత్ ఇప్పటికే ప్రకటించారు. మనుషులు లేని ఆ ఎడారులు ఎందుకు అనుకుంటే... మరొక మార్గం కూడా ఉంది. మీ జేబులు కాస్త బరువుగా ఉంటే... అదే మీ వద్ద డబ్బు బాగా ఉంటే ఏదైనా దేశం నుంచి ద్వీపాన్ని కొనుక్కోవచ్చు. ఆ ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకోవచ్చు. కానీ అందుకు ఆ దేశం అంగీకరించాలి.
 
దేశాన్ని కొనుక్కోవచ్చా?
లక్షల్లో జనాభా ఉండే చిన్నచిన్న ద్వీప దేశాలు చాలానే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వాలు ఒప్పుకుంటే మీరు డబ్బు చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు.  భూమి కాకపోతే నీరు, భూమి మీద దేశం ఏర్పాటు చేయడం కష్టంగా అనిపిస్తే నీళ్ల మీద కూడా జెండా పాతేయొచ్చు. అంతర్జాతీయ సముద్ర జలాలు ఏ దేశం అధీనంలోనూ ఉండవు. కాబట్టి, సముద్రంలో ఒక దీవిని కృత్రిమంగా ఏర్పాటు చేసి, దాన్నే దేశంగా ప్రకటించుకోవచ్చు.

 
దేశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
నేల మీదనో నీళ్ల మీదనో మీ కంటూ కొంచెం జాగా దొరికింది. ఇప్పుడు దాన్ని మీరు దేశంగా ప్రకటించుకోవాలి. నేనే దానికి అధిపతిని అని చెప్పుకోవాలి. మరి ఇదంతా ఎలా జరగాలి? మాంటేవీడియో కన్వెన్షన్(1933) ప్రకారం, ఒక దేశానికి ఈ లక్షణాలు ఉండాలి...

 
శాశ్వతంగా నివసించే జనాభా
స్పష్టమైన సరిహద్దులు
ప్రభుత్వం
ఇతర దేశాలతో సంబంధాలు నెరపగల సామర్థ్యం
 
సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి
దేశం లేదా రాజ్యం అంటే ఇంకా చాలానే ఉంటాయి కదా! దానికో పేరు ఉండాలి. జాతీయ జెండా, జాతీయ చిహ్నం, భాష ఇలాంటివి చాలానే ఉంటాయి. ఆ తరువాత ముఖ్యమైనది పరిపాలనా వ్యవస్థ. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నారా? లేక నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో రాచరికం ఉండాలని భావిస్తున్నారా? అన్నది నిర్ణయించుకోవాలి. దానికి తగినట్లుగా రాజ్యాంగం రాసుకోవాలి.
 
శాసన వ్యవస్థ
కార్యనిర్వాహక వ్యవస్థ
న్యాయ వ్యవస్థ
చట్టాలు, విధి విధానాలు
...ఇలా అనేక వ్యవస్థలను, చట్టాలను రూపొందించాలి.
 
ఆర్థికవ్యవస్థ
దేశం అంటే ప్రజలు ఉంటారు. ప్రజలు ఉంటే వారికి తిండి కావాలి. తిండి కావాలంటే పని కావాలి. పని కావాలంటే ఆర్థికవ్యవస్థ ఉండాలి. కాబట్టి, ఆదాయం వచ్చే రంగాలను గుర్తించాలి. దేశానికంటూ ఒక కరెన్సీని ఏర్పాటు చేయాలి. ఆర్థికవ్యవహారాలు, కరెన్సీ చలామణీని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
 
గుర్తింపు
ఇప్పుడు మీ దగ్గర ఒక దేశం ఉంది. అందులో ప్రజలు నివసిస్తున్నారు. పాలకులు ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మీ దేశాన్ని నలుగురు గుర్తించడం. మిమ్మల్ని ఆ దేశాధిపతిగా చూడటం. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. దానికి ఇతర దేశాల సాయం కావాలి. సమన్వయం ఉండాలి. అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోయినా మీ దేశం మనుగడ సాగిస్తుంది. యూఎన్ చార్టర్ ప్రకారం మీకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. సరిహద్దుల రక్షణ, సార్వభౌమాధికారానికి భద్రత వంటివి లభిస్తాయి. అంతర్జాతీయ గుర్తింపు, వాణిజ్యబంధాలు పెంచుకొనేందుకు ఐక్యరాజ్యసమితి వంటి కూటముల్లో చేరాల్సి ఉంటుంది. తద్వారా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి వాటి సాయం అందుతుంది. ఇతర దేశాలు అధికారికంగా దౌత్యసంబంధాలు ప్రారంభిస్తాయి. ఐక్యరాజ్యసమితితో సంబంధం లేకుండా కూడా దేశాలు ఉండొచ్చు.
 
దేశానికి గుర్తింపును ఇచ్చే ఒక సంస్థ లేదా వ్యవస్థ అంటూ అంతర్జాతీయంగా ఏమీ లేదు. 'మాది స్వతంత్ర దేశం' అంటూ ప్రకటించుకున్న భూభాగాలను కొన్ని దేశాలు గుర్తిస్తుంటాయి. మరికొన్ని గుర్తించవు. అది ఆయా దేశాల ఇష్టం. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ కూటముల్లో ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
 
ఐక్యరాజ్యసమితిలో చేరాలంటే?
ఐక్యరాజ్యసమితిలో చేరాలనుకుంటే అందులో సభ్యత్వం కోరుతూ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాలి. ఆ తరువాత ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి దాని మీద చర్చించి జనరల్ అసెంబ్లీకి సిఫారసు చేయాల్సి ఉంటుంది. జనరల్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితే ఒక దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లభిస్తుంది.
 
ఎవరైనా దేశాలు ఏర్పాటు చేసుకున్నారా?
దేశాలు ఏర్పాటు చేసుకోవడం, సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడం కొత్తేమీ కాదు. అలాంటి దేశాలు ఇప్పటికే ఉన్నాయి. బ్రిటన్‌కు దగ్గరగా నార్త్ సీలో ఉంది ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్’ అనే స్వయంప్రకటిత దేశం. బ్రిటన్ తీరానిక ఇది సుమారు 12 కిలోమీటర్ల తీరంలో ఉంటుంది. రెండో ప్రపంచయుద్ధం కాలంలో నాజీల వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్లాట్‌ఫామ్స్‌ను బ్రిటన్ నిర్మించింది. నాడు సుమారు 300 మంది బ్రిటన్ సైనికులు అక్కడ పని చేసేవారు. 1956లో వాటిని బ్రిటన్ వదిలేసింది. బ్రిటిష్ సైన్యానికి చెందిన మాజీ అధికారి రాయ్ బేట్స్ 1967లో ‘హెచ్‌ఎమ్ ఫోర్ట్ రఫ్స్’ అనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత దాన్ని ఒక దేశంగా ఆయన ప్రకటించారు. దానికి ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ అని పేరు పెట్టడంతోపాటు తనను ప్రిన్స్‌గా చెప్పుకున్నారు.
 
91ఏళ్ల వయసులో రాయ్ బేట్స్ 2012లో చనిపోయారు. ఆ తరువాత ఆయన కొడుకు మైఖేల్ పాలన చేపట్టారు. వారి బంధువులు, స్నేహితులు మొత్తం కలుపుకుంటే ఒకప్పుడు ఆ దేశంలో 50 మంది వరకు నివసించే వారు. ఈ దేశాన్ని ఎవరూ ఇంత వరకు గుర్తించలేదు. తమకు ఎవరి గుర్తింపు అవసరం లేదని వారు చెబుతుంటారు. ఇప్పటి వరకు 500 పాస్‌పోర్టులు జారీ చేసినట్లు మేఖైల్ చెప్పారు. ఈ దేశానికి సొంత కరెన్సీ, ఫుట్‌బాల్ జట్టు కూడా ఉంది.
 
కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సుయాస్ దీక్షిత్ తాను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు 2017లో ప్రకటించారు. ఈజిప్టు, సూడాన్ మధ్య గల బిర్ తావిల్‌లో ‘కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్’‌ను స్థాపించినట్లు తెలిపారు. సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే బిర్ తావిల్ ప్రాంతం మీద ఏ దేశానికి హక్కులు లేవు. రాజ్యాన్ని స్థాపించిన సుయాస్, తనను తాను రాజుగా ప్రకటించుకున్నారు.