1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:42 IST)

కాకాని గోవర్ధన్ రెడ్డి: ఏపీ మంత్రి చుట్టూ మరో వివాదం, ఆ విల్లాలో యువకుడి మృతికి కారణమేంటి?

Kakani Govardhan Reddy
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవవర్ధన్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆయన నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు నెల్లూరు కోర్టులో అపహరణకు గురికావడం పెనుదుమారం రేపింది. రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన సన్నిహితులకు సంబంధించిన విల్లాలో ఓ యువకుడి అనుమాస్పద మరణం మరో వివాదానికి కారణమైంది. మంగళగిరి రూరల్ మండలం కాజలోని విల్లాలో షేక్ మహమద్ అనే 20 ఏళ్ల యువకుడి మృతికి విద్యుత్ షాక్ కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ మృతిపై దర్యాప్తు జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

 
ఎఫ్ఐఆర్‌లో ఏముంది?
ఈ ఘటనకు సంబంధించి నమోదైన ఎఫ్ఐర్‌లోని సమాచారం ప్రకారం- మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారులో నివసించే మహమద్ అనే యువకుడు ఒక ఏసీ మెకానిక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తారు. మసీదు వీధిలోని న్యూ స్టార్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ వర్క్స్‌లో పనిచేసే తన సహచరుడితో కలిసి మహమద్ ఏసీ మరమ్మతుల కోసం కాజలోని ఐజేఎం అపార్ట్‌మెంట్స్ పేరుతో ఉన్న రెయిన్ ట్రీ పార్క్ విల్లాకి ఏప్రిల్ 16 (శనివారం) ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్లారు.

 
11 గంటల సమయంలో విల్లా పైఅంతస్తులో మహమద్ చనిపోయి పడి ఉండటాన్ని ఆయనతోపాటు వచ్చిన ఏసీ మెకానిక్ గుర్తించారు. వెంటనే మహమద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. స్థానికులతో కలిసి సమీపంలో ఉన్న ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. మహమద్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. మహమద్ నానమ్మ షేక్ కమురున్నీసా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ నెం. 229/2022 గా కేసు నమోదు చేశారు. సీఆర్ పీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

 
విద్యుత్ షాక్ వల్లే: ఎస్‌ఐ
విద్యుత్ షాక్ వల్లే మహమద్ చనిపోయినట్టు భావిస్తున్నామని కేసు దర్యాప్తు అధికారి, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ బి.విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. "ఏసీ పనిచేయడం లేదని ఫోన్ కాల్ రావడంతో మెకానిక్‌తో కలిసి మహమద్ అక్కడికి వెళ్లారు. అది బాగు చేశారు. డబ్బులు ఇవ్వాలని వేచి చూస్తుండగా మహమద్‌కు ఫోన్ వచ్చింది. సిగ్నల్ సరిగా లేకపోవడంతో మొదటి అంతస్తుకు వెళ్లాడు. ఈలోగా మెకానిక్ కింద డబ్బులు తీసుకుని, ఇంకా రావడం లేదేంటా అని పైకి వెళ్లి చూసే సరికి మహమద్ కిందపడిపోయి ఉన్నాడు. కంగారుగా అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించేసరికి, అతడు చనిపోయినట్టు డ్యూటీ డాక్టర్ నిర్ధరించారు. చేతికి గాయం ఉంది. కాబట్టి అది విద్యుత్ షాక్ వల్ల జరిగిందని భావిస్తున్నాం" అని ఆయన వివరించారు.

 
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. కానీ, తమకు సాయంత్రం 6 గంటలకు మృతుడి నానమ్మ ఫిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాము కేసు రిజిస్టర్ చేసి అనుమానాస్పద మృతిగా దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై విజయ్ కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

 
విల్లా ఎవరిది?
మంత్రిగా ఏప్రిల్ 11న కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గానూ వ్యవహరించారు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు సహా ఏ కార్యక్రమానికి హాజరైనా, ఈ విల్లాకు వస్తుంటారని సెక్యూరిటీ సిబ్బంది బీబీసీకి తెలిపారు. విల్లాకు ఎదురుగా మంత్రి కాకాణికి అభినందనలు చెబుతూ భారీ ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడి విల్లాలలో కాకాణితో పాటు పలువురు ఇతర మంత్రులు కూడా నివాసం ఉంటున్నారు. అయితే మహమద్ మరణించిన విల్లా గణేశ్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఉందని పోలీసులు బీబీసీకి తెలిపారు. గణేశ్ రెడ్డి మంత్రి కాకాణికి సన్నిహితుడు.

 
మహమద్ మరణంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండి, అక్కడ అడుగుపెట్టిన కొద్దిసేపటికే యువకుడు చనిపోయాడని, దీనిపై దర్యాప్తు చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్ డిమాండ్ చేశారు.
నెల్లూరు కోర్టులో కాకాణి కేసుకి సంబంధించిన పత్రాల దొంగతనం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన రోజే ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోందని, రెండింటికీ సంబంధం ఉందా అన్నది తేల్చాలని ఆయన కోరారు.

 
"ఏసీ మరమ్మత్తుల కోసం పిలిస్తే మేడపైకి ఎందుకు వెళతారన్నది అర్థం కావడం లేదు. పోలీసులు ఘటన జరిగిన కొన్ని గంటల వరకూ కేసు ఎందుకు నమోదు చేయలేదన్నది తెలియాలి. మహమద్ చనిపోయినట్టు మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే ఆస్పత్రి వైద్యులు నిర్ధరిస్తే సాయంత్రం ఆరు గంటల వరకు ఏం జరిగిందన్నది తెలియాలి. దానికి తగ్గట్టుగా ఉన్నతాధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలి" అని ఆనందసాగర్ డిమాండ్ చేశారు. ఘటన తర్వాత విల్లా యజమానిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఆ యజమానిని విచారించలేదని, ఇది అందరికీ అపోహలు కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

 
ఆ అనుమానంతోనే కేసు పెట్టాం: కమురున్నీసా
"మా పిల్లాడు చనిపోయాడు. ఒంటిమీద దెబ్బలున్నాయి. మేస్త్రీ కొట్టాడేమోననే సందేహంతో కేసు పెట్టాం. పోలీసులు కరెంట్ షాక్ అని చెబుతున్నారు. చేతికందిన బిడ్డను కోల్పోయి బాధలో ఉన్నాం" అని కమురున్నీసా బీబీసీతో అన్నారు. మహమద్ శనివారం మధ్యాహ్నం చనిపోతే మృతదేహానికి సోమవారం సాయంత్రం పోస్ట్ మార్టమ్ పూర్తయ్యింది. శనివారం ఆలస్యంగా తమకు ఫిర్యాదు అందిందని, ఆదివారం గవర్నర్ సెక్యూరిటీలో ఉండటం వల్ల శవ పంచనామా లాంటివి ఆలస్యమయ్యాయని దర్యాప్తు అధికారి చెబుతున్నారు.

 
ఈ ఘటనపై విల్లా యజమానులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ విల్లా దగ్గర వారు అందుబాటులో లేరు. అక్కడ సిబ్బందిని సంప్రదించగా, మహమద్ మరణం ప్రమాదమని మాత్రం చెప్పారు. ఈ అంశంపై మంత్రి కాకాణి స్పందన కోసం బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.