వార్తల్లో నిలిచిన ఎంపీ నందిగం.. అసలేం జరిగిందంటే?
ఎంపీ నందిగం సురేష్ వార్తల్లో నిలిచారు. ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదంటూ ఓ కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేశ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కానీ విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ సురేశ్ వెనక్కి తగ్గారు.
తాను కానిస్టేబుల్‌ను ఏమీ అనలేదని, హెల్మెట్ ఉంచుకుని కూడా పెట్టుకోనందుకు తన మనిషిపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. అంతేగాకుండా అదే కానిస్టేబుల్ గతంలో తాను అతడికి ఫేవర్‌గా చేసిన పనిని గుర్తు చేసుకున్నారని ఎంపీ వివరించారు.
అసలేం జరిగిందంటే..? అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ బైకర్‌ను ఆపిన పోలీసులు పత్రాలు చూపించమని అడిగారు.
అయితే, తాను ఎంపీ నందిగం సురేశ్ మనిషినని చెప్పాడు. అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనని నిలదీశారు. దీంతో ఆయన ఎంపీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్‌ను కానిస్టేబుల్‌కు ఇచ్చాడు.
తాను ఎంపీని మాట్లాడుతున్నానని, అతడిని విడిచిపెట్టాలని సురేశ్ కోరారు. అందుకు కానిస్టేబుల్ ముక్తసరిగా సరేనని చెప్పి వదిలిపెట్టాడు.
అయితే, తాను ఎంపీనని చెబుతున్నా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. వెంటనే తన ఇంటికి రావాలని ఆ కానిస్టేబుల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు, ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారికి ఎంపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.