1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (18:06 IST)

కర్నాటకలో ముదురుతున్న హిజాబ్ వివాదం : స్కూల్స్ - కాలేజీలకు సెలవు

కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం ముదురుతోంది. దీంతో మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసివేస్తున్నట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. హిజాబ్ వివాదం బాగా ముదిరిపోవడంతో బాగల్ కోట్‌లో ఉద్రిక్తత నెలకొంది. పీయూ కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువుని ప్రయోగించారు. 
 
అంతేకాకుండా ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున, హైకోర్టు తీర్పును వెలువరించేంత వరకు సంయమనం పాటించాలన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. అలాగే ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేయొద్దని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. 
 
కర్నాటక రాష్ట్రంలోని ఓ ప్రభుత్వం కాలేజీలోని తరగతి గదిలో హిజాబ్ ధరించడాన్ని నిరాకరించారు. దీంతో హిజాబ్ వివాదం మొదలైంది. దీనిపై 8 మంది ముస్లిం విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత చాలా కాలేజీలకు చెందిన విద్యార్థినిలు దీనిపై తమ గళం వినిపించారు. ఇటీవల ఓ కాలేజీలో హిజాబ్ ధరించిన అమ్మాయిలను వేరుగా కూర్చోబెట్టారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. 
 
ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడానికి అనుమతి ఉంది. హిజాబ్ ధరించడంపై అవగాహన కల్పించడానికి వీలుగా ఈ నెల ఒకటో తేదీ ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. దీని తర్వాతే ఈ వివాదం మరింత ముదిరింది. చాలా మంది ముస్లిం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ, పలు కాలేజీ యాజమాన్యాలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.