1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (13:15 IST)

కరోనా కేసులు పెరుగుతున్నాయ్.... విద్యా సంస్థల సెలవులు పొడిగించండి...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, అందువ‌ల్ల విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు పొడిగించాల‌ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉదృతమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాల‌న్నారు. 
 
 
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చెయ్యాల‌ని లోకేష్ డిమాండు చేశారు. 
 
 
15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విద్యార్థులు,  తల్లిదండ్రులు,టీచర్ల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. గత పది రోజుల్లో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పోయిన పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుండి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో స్కూల్స్ ప్రారంభించడం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంద‌ని లోకేష్ అభిప్రాయ‌ప‌డ్డారు. 
 

ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల  వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంద‌ని లోకేష్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాల‌ని నారా లోకేష్ డిమాండు చేశారు.