బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2022 (15:10 IST)

కేజీఎఫ్: రియల్ రాకీ భాయ్ ‘‘థంగం రౌడీ’’ ఎవరు? ఆయన్ను ‘‘జూనియర్ వీరప్పన్’’ అని ఎందుకు పిలుస్తారు?

Yash
‘‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’’. కేజీఎఫ్‌ చాప్టర్-1లోని ఈ డైలాగ్‌ను అంత తేలిగ్గా మరచిపోలేరు. తల్లి ప్రేమను గుర్తుచేస్తూ హీరో రాకీ భాయ్ ఈ డైలాగ్ చెబుతారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్-2 విడుదలై బాక్సాఫీస్ రికార్డు బద్దలు కొడుతోంది. మీరు చదువుతున్న ఈ కథనానికి మొదట్లో రాసిన తల్లి డైలాగ్‌కు సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? అయితే, రియల్ రాకీ భాయ్ థంగం రౌడీ గురించి తెలుసుకోవాలి.

 
థంగం రౌడీని స్ఫూర్తిగా తీసుకొని కేజీఎఫ్ సినిమాను తీశారా? అని ఆ సినిమా ప్రొడ్యూసర్-డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే, ఆ ప్రశ్నలను ప్రశాంత్ ఖండించారు. కేజీఎఫ్ రాకీ భాయ్ కథ పూర్తిగా కల్పితమని ప్రశాంత్ నీల్ చెప్పారు. అయితే, రియల్ లైఫ్ థంగం రౌడీకి ‘‘రీల్ రాకీ’’కి చాలా పోలికలు ఉన్నాయని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

 
థంగం రౌడీ తల్లి కేసు
మరోవైపు కేజీఎఫ్ సినిమాపై థంగం రౌడీ తల్లి కోర్టులో ఓ కేసు వేశారు. తన కొడుకు పాత్రను సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 1990ల్లో కరడుకట్టిన నేరస్థుల్లో థంగం ఒకరు. కోలార్‌లో పనిచేసే ఆయన గ్యాంగ్.. భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకెళ్లేది. అందుకే ఆయన్ను జూనియర్ వీరప్పన్‌గా పిలిచేవారు. 1997లో ఆయనపై ఇండియా టుడే ఒక కథనాన్ని ప్రచురించింది. 25 ఏళ్ల థంగం.. బంగారం దోపిడీలకు పెట్టింది పేరని దానిలో పేర్కొన్నారు. ఓ టాటా సుమోను కూడా థంగం దోచుకెళ్లాడని ఆ కథనంలో తెలిపారు.

 
కేవలం నాలుగేళ్లలో థంగంపై 42 దోపిడీ కేసులు నమోదయ్యాయి. అయితే, ప్రజల్లో థంగంకు మంచి మద్దతు ఉండేది. దొంగతనం చేసిన బంగారాన్ని ఆయన ప్రజలకు పంచినట్లు కథనాలు వచ్చాయి. అయితే, కనిపిస్తే కాల్చి చంపేయాలని షూటింగ్ ఆర్డర్స్ కూడా ఆయనపై జారీ అయ్యాయి. 1997లో పోలీసులతో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో థంగం మరణించాడు.

 
థంగం తల్లి ఏం చెబుతున్నారు?
తన కొడుకు జీవిత కథ ఆధారంగానే కేజీఎఫ్ సినిమా తీశారని థంగం తల్లి పౌలి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేజీఎఫ్-1 సినిమా విడుదల సమయంలోనే ఆమె కోర్టులో కేసు వేశారు. తన కొడుకును సినిమాలో నెగిటివ్‌గా చూపించారని ఆమె ఆరోపించారు. తన కొడుకుపై సినిమా తీసేటప్పుడు కనీసం తన నుంచి అనుమతి కూడా తీసుకోలేదని ఆమె అన్నారు.
అయితే, పౌలి ఆరోపణలను ప్రశాంత్ నీల్ ఖండించారు. కేజీఎఫ్‌, థంగంల మధ్య ఎలాంటి సంబంధమూలేదని ప్రశాంత్ చెప్పారు.

 
ఇదివరకు కన్నడలో ‘‘కోలార్’’అనే సినిమా తీశారు. ఇది థంగం జీవితంపై తెరకెక్కిన సినిమా. ఈ సినిమా నిర్మాతలు తన దగ్గరకు వచ్చారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ చెప్పారు. ‘‘కోలార్ సినిమా ప్రతినిధులు మా దగ్గరకు వచ్చారు. మేం థంగం జీవిత కథ ఆధారంగా సినిమా తీయడంలేదని వారికి వివరించాం. నిజానికి థంగం జీవిత కథ కూడా మాకు తెలియదని చెప్పాం’’ అని ఇంటర్వ్యూలో ప్రశాంత్ వివరించారు. థంగం జీవితంలో తల్లి పౌలి ప్రధాన పాత్ర పోషించారు. థంగం గ్యాంగ్‌ను పౌలి గ్యాంగ్ అని కూడా పిలిచేవారు. కేజీఎఫ్‌లో రాకీ చిన్నప్పుడే ఆయన తల్లి చనిపోతుంది. ప్రపంచంలోనే శక్తిమంతమైన నాయకుడిగా తాను ఎదుగుతానని తల్లికి రాకీ మాట ఇస్తాడు.

 
తంగం బ్రదర్స్..
కేజీఎఫ్ సినిమాలో రాకీకి తోబుట్టువులు ఎవరూ ఉండరు. థంగంకు మాత్రం ముగ్గురు సోదరులు ఉన్నారు. వీరంతా ఎన్‌కౌంటర్లలో మరణించారు. 1997లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఎన్‌కౌంటర్‌లో థంగం మరణించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆయన సోదరులు డోపి, జయకుమార్ కూడా పోలీసులతో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దీంతో తన ముగ్గురు సోదరులను హత్యచేసిన పోలీసులపై ప్రతీకారం తీర్చుకుంటానని సగయం ప్రతిన చేశారు.

 
అయితే, బెంగళూరు శివార్లలోని రామమూర్తినగర్‌లో ఆయన్ను కూడా పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని అతడికి పోలీసులు సూచించారు. కానీ, సగయం కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు మరణించాడు. దీంతో ఆరేళ్లలోనే నలుగురు థంగం సోదరులను పోలీసులు ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపినట్లైంది.